బూర్గంపహాడ్, జూన్ 24 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, కార్మికులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయన్నారు. మత్తు పదార్ధాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, అంతేకాకుండా యువకులపై కేసులు నమోదైతే జీవితాంతం జైలు పాలు కావాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి మంచి నడవడికతో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి సేవించినా, విక్రయించినా అలాంటి వారి సమాచారం పోలీసుస్టేషన్‌కు లేదా 100కు డయల్ చేసి తెలియచేయాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ నాగభిక్షం, ఎస్ఐ రామ్మూర్తి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.