Tumor | హైదరాబాద్, జూన్ 24 : హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్య సంస్థ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్లు వైద్య రంగంలో అరుదైన అద్భుతాన్నిసాధించారు. కేవలం 6 కిలోల బరువున్న ఓ 6 నెలల ఆడపాప కడుపు నుండి అత్యంత అరుదైన, 500 గ్రాముల బరువున్న భారీ కణితిని (Tumor) శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.
సర్జరీ జరిగి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంతో చురుగ్గా ఉంటూ, సకాలంలో పాలు తాగుతూ, వయసుకు తగ్గట్టుగా బరువు పెరుగుతోంది.
పాప కడుపు భాగం అసాధారణంగా ఉబ్బిపోవడం, అలాగే వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం, పాప కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే మరిన్ని నిర్ధారణ పరీక్షల కోసం ఇమేజింగ్ స్టడీస్‌ను సిఫార్సు చేశారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో కణితి ఉన్నట్లు స్పష్టమైంది. కణితి పరిమాణం చాలా పెద్దదిగా ఉండటం వల్ల, అది చుట్టుపక్కల ఉన్న ఇతర అవయవాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన మల్టీ డిసిప్లినరీ వైద్యుల బృందం, ఆలస్యం చేయకుండా వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది.
సుమారు 4 గంటల పాటు అత్యంత సంక్లిష్టంగా సాగిన ఈ ఆపరేషన్‌లో వైద్యుల బృందం చిన్నారి శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ఆ 500 గ్రాముల కణితిని సురక్షితంగా, పూర్తిగా తొలగించగలిగారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో ఉంచి నిరంతరం పర్యవేక్షించారు. క్రమంగా వెంటిలేటర్ మద్దతును తొలగించగా.. పాప శరీరంలోని అన్ని కీలక అవయవాలు స్థిరంగా పనిచేయడం ప్రారంభించాయి. ఆ తర్వాత చిన్నారికి పాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పాప వేగంగా కోలుకోవడంతో, శస్త్రచికిత్స జరిగిన ఐదో రోజే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తర్వాత నిర్వహించిన హిస్టోపాథాలజికల్ (బయాప్సి) పరీక్షలో అది ప్రాణాంతకం కానీ, కేవలం ఒక ‘బెనిన్ మెచ్యూర్ సిస్టిక్ టెరాటోమా’ (Benign Mature Cystic Teratoma) రకానికి చెందిన కణితిగా నిర్ధారణ అయింది.
వైద్య బృందం సమన్వయంతో శ్రమించడం వల్లే..
ఈ విజయవంతమైన చికిత్స గురించి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ & నియోనాటాలజిస్ట్ డాక్టర్ రిషివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు సరైన సమయంలో పాపలోని లక్షణాలను గుర్తించి ఆసుపత్రికి తీసుకురావడం, అలాగే మా మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో శ్రమించడం వల్లే ఈ అద్భుతమైన ఫలితం సాధ్యమైంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ జరిగి, సరైన శస్త్రచికిత్స అందించడం వల్ల చిన్నారి వేగంగా కోలుకుని, మళ్లీ సాధారణ వృద్ధిని సాధించగలిగిందని తెలిపారు.
నెల రోజుల తర్వాత నిర్వహించిన ఫాలో-అప్ తనిఖీలో చిన్నారి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, చురుగ్గా ఉంటూ, సక్రమంగా పాలు తాగుతూ, బరువు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. పాప ఎదుగుదల మైలురాళ్లు (Developmental milestones) కూడా వయసుకు తగ్గట్టుగా బాగున్నాయని, ప్రస్తుతం చిన్నారి క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉందని వారు పేర్కొన్నారు.
చిన్నారులలో ఇటువంటి అసాధారణ వాపులు, పొత్తికడుపు ఉబ్బడం లేదా బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. సకాలంలో స్కానింగ్ పరీక్షలు, ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ, నిపుణులైన వైద్యుల సంరక్షణ ద్వారా ఇలాంటి అరుదైన, క్లిష్టమైన ఆరోగ్య సమస్యల నుండి కూడా చిన్నారులను సురక్షితంగా కాపాడుకోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.