Jayam Ravi | తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆయన పేరు ఇప్పుడు మరో ఘటనతో చర్చనీయాంశంగా మారింది. తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా కార్మికులతో పాటు ఓ బాలుడిని అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలోని నీలాంకరై ప్రాంతంలో రవి మోహన్ నివాసం ఉంటున్నారు. సమాచారం ప్రకారం, తన ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుమానంతో ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలతో పాటు ఓ బాలుడిని ఇంట్లోనే బంధించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పనికి వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారిలో ఒకరు నేరుగా రవి మోహన్ నివాసానికి వెళ్లి విచారించగా, వారిని ఇంట్లోనే ఉంచినట్లు తెలిసిందట. కుటుంబ సభ్యులు వారిని పంపించాలని కోరినప్పటికీ అందుకు అంగీకరించలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు నీలాంకరై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రవి మోహన్ నివాసానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఇంట్లో పనిచేసే వారిని బలవంతంగా నిర్బంధించడం సరైన పద్ధతి కాదని సూచించినట్లు సమాచారం. దొంగతనం జరిగిందనే అనుమానం ఉంటే చట్టపరంగా ఫిర్యాదు చేయాలని, స్వయంగా విచారణ జరపడం సరికాదని నటుడికి సూచించినట్లు తెలుస్తోంది.
పోలీసుల జోక్యంతో అక్కడ ఉన్న మహిళలు, బాలుడు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను రవి మోహన్ తరఫు ప్రతినిధులు పూర్తిగా ఖండించారు. వారి వాదన ప్రకారం, ఇంట్లో నగదు, ఆభరణాలు కనిపించకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించామని, కానీ ఎలాంటి అక్రమ నిర్బంధం జరగలేదని స్పష్టం చేశారు. దొంగతనంపై అనుమానాలు వ్యక్తం చేయడం మాత్రమే జరిగిందని, ఈ ఘటనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇరు వర్గాల వాదనలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో అసలు ఏం జరిగింది? నిజంగా నిర్బంధం జరిగిందా? లేక దొంగతనం అనుమానంతో ప్రశ్నించడమేనా? అనే అంశాలపై దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో కూడా రవి మోహన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పేరు మరోసారి వివాదంలో చిక్కుకోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.