ఝరాసంగం, జూలై 5 : హిందూ దేవాలయాలు ధర్మరక్షణకు నిలయాలని, నూతన ఆలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రాజగోపురాన్ని ఆదివారం ఉదయం వారు వేదోక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణం, విశేష హోమాలు, యంత్రస్థాపన, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రాజగోపుర మహా కుంభస్థాపన చేపట్టి, పీఠాధిపతులు మహా మంగళహారతి సమర్పించారు. క్రేన్ సహాయంతో ఐదు కలశాలను రాజగోపుర శిఖరంపై ప్రతిష్ఠించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి.
ఆదర్శ దాతలు..
హైదరాబాద్‌లోని నిజాంపేట్‌కు చెందిన సునీత–భద్రారెడ్డి దంపతులు అనేక దేవాలయాల నిర్మాణానికి, అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పీఠాధిపతులు కొనియాడారు. కేవలం బర్దిపూర్ గ్రామ అభివృద్ధికే వారు ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా విరాళాలు అందించినట్లు వెల్లడించారు. ఆలయ పురోగతికి తోడ్పాటునందించిన సునీత–భద్రారెడ్డి దంపతులను ఆశ్రమ పీఠాధిపతులు, బర్దిపూర్ గ్రామస్తులు, భక్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.