గజ్వేల్, జనవరి 8: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత సమితి కార్యాలయంలో 1997లో ప్రా రంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొన్నేండ్ల పాటు కో-ఎడ్యుకేషన్‌గా కొనసాగింది. అడ్మిషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ కళాశాలను బాలుర, బాలికల కళాశాలలుగా ఏర్పాటు చేశారు. ఇరుకు గదుల్లో బోధన చేయడం ఇబ్బందిగా మారడంతో కేసీఆర్ సీఎం కాగానే సంగాపూర్ సమీపంలో బాలురకు, బాలికలకు వేర్వేగా ఎడ్యుకేషన్ హబ్‌లు నిర్మించారు. 2024-25 విద్యా సంవత్సరం నుం చి బాలుర డిగ్రీ కళాశాలలో కో-ఎడ్యుకేషన్ తిరిగి కొనసాగుతున్నది.
ప్రస్తుతం గజ్వేల్ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా రావడంతో అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల తర్వాత జిల్లాలో రెండో అటానమస్ డిగ్రీ కళాశాలగా గజ్వేల్‌కు అవకాశం లభించింది. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(కో-ఎడ్యుకేషన్)కు అటానమస్ హోదాను కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు, గవర్నర్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌కు యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనోహర్ వివరాలతో కూడిన లేఖను పం పించారు.
డిసెంబర్ నెలలో జరిగిన కమిషన్ సమావేశంలో ఈ మేరకు స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. 2025-26 నుంచి 2029-30విద్యా సంవత్సరం వరకు వచ్చే ఐదేండ్లు అటానమస్ కొనసాగనున్నది. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతి పత్తి హోదాతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. అడ్మిషన్ ప్రక్రియ సులభతరం కానున్నది. ఈ హోదాతో కళాశాల ప్రిన్సిపాల్‌కు నిర్ణయాధికారం ఉంటుంది. అటానమస్ హోదాతో విద్యార్థులకు ప్రయోజనం ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నిఖత్ అంజుమ్ మాట్లాడుతూ.. అటానమస్ హోదా దక్కడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.