
చార్మినార్, జనవరి 4: వెంబడిస్తున్న యువకుల నుంచి రక్షిస్తారని ఓ బాలిక ఆటో డ్రైవర్లను ఆశ్రయిస్తే.. ఇంటికి తీసుకెళ్లి.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. కూతురు లాంటిదని కూడా చూడకుండా ఆ మృగాలకు భార్యలు కూడా సహకరించారు. బలవంతంగా బాలికను వ్యభిచార రొంపిలోకి దింపారు. నెలరోజుల పాటు వ్యాపారం నడిపించారు. చిత్ర హింసలకు గురవుతున్న ఆ బాలిక ఇన్స్టాగ్రామ్ ద్వారా సందేహం పంపడంతో ఎట్టకేలకు పోలీసులు రక్షించారు. బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బహదూర్‌ఫుర ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
బహదూర్‌ఫుర పీఎస్ పరిధికి చెందిన ఓ మహిళ భర్త కొన్నేండ్ల కిందట దూరం కావడంతో తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి నివాసముంటుంది. స్థానికంగా ఓ ప్రైవేటు దవాఖానలో హౌస్ కీపర్‌గా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నది. ఇదిలా ఉండగా, నవంబర్ 20వ తేదీన రాత్రి అక్కాచెల్లెలు చిన్న విషయంలో గొడవపడ్డారు. దీంతో బాధిత బాలిక (15) దవాఖానలో పనిచేస్తున్న తల్లి వద్దకు వెళ్తున్నానని చెప్పి అర్ధరాత్రి సమయంలో ఇంటినుంచి బయలుదేరింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫిష్ బిల్డింగ్ వద్దకు చేరుకోగానే కొంతమంది యువకులు బాలికను వెంబడించారు. దీంతో సమీపంలోని ఆటో స్టాండ్‌లో ఉన్న ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్ వద్దకు వెళ్లి.. యువకులు వెంబడిస్తున్నారని తెలిపింది. ఆటో డ్రైవర్లు ఆ యువకులను అడ్డుకుని హెచ్చరించి పంపించేశారు. బాలిక అదృశ్యంపై మరుసటి రోజున కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుల ఇంట్లో బందీగా..
ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్ బాధిత బాలికను ఉప్పర్‌పల్లిలోని తమ నివాసానికి తీసుకెళ్లారు. ఇక నుంచి బాలిక ఇక్కడే ఉంటుందంటూ సమీర్ తన భార్య బుషేరా సుల్తానా అలియాస్ సనాతో తెలిపాడు. మరుసటి రోజు నుంచి బాలికకు గుర్తు తెలియని మత్తుమందు ఇస్తూ.., మత్తులోకి జారుకోగానే సమీర్, హఫీజ్ లైంగిక దాడికి పాల్పడటం మొదలు పెట్టారు. నెల రోజుల పాటు బాలికను చిత్ర హింసలకు గురిచేస్తూ.. ఇరువురు ఆటోడ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఉప్పర్‌పల్లిలోని తమ నివాసాన్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలీనగర్‌కు మార్చారు. అనంతరం బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. నిందితులు తమ స్నేహితులతోపాటు ఇతర విటులను తమ ఇంటికి రప్పించి వ్యాపారం నిర్వహించారు. వీరికి స్థానికంగా నివాసముండే అయేషాబేగం సహకరించడంతో అక్రమార్జనకు పాల్పడ్డారు.
పట్టించిన ఇన్స్టాగ్రామ్
నిందితుల నుంచి ఎలాగైనా బయటపడాలని బాలిక నిర్ణయించుకుంది. రహస్యంగా అయేషా మొబైల్ నుంచి తన సోదరి ఇన్‌స్టాగ్రామ్‌కు సందేశాన్ని చేరవేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బహదూర్‌పుర పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్టాగ్రామ్ సందేశం ఆధారంగా ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో కలిసి బాధితురాలిని బంధించిన నివాసాన్ని గుర్తించారు. బాలికను బంధించిన సనా, అయేషాను అదుపులోకి తీసుకున్నారు. బాలికను తప్పుదారి పట్టించిన ప్రధాన నిందితులైన సమీర్, హఫీజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరిలించారు. కేసు దర్యాప్తులో ఎస్సై వెంకటేశ్వర్రావుతోపాటు క్రైం సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.