కాసిపేట, సెప్టెంబర్ 29 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ రామటెంకి దుర్గాప్రసాద్ (42) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంజనేయపుత్ర ఆటో యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆటోలు బంద్ పాటించారు. దుర్గా ప్రసాద్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్న దుర్గాప్రసాద్ మృతితో ఆయన భార్య, కుమార్తె పెద్ద దిక్కును కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
నిత్యావసరాల ధరలు, ఇంధనం ధరలు పెరుగడంతో కుటుంబ పోషణ కష్టమవుతుందని, మహాలక్ష్మి పథకంతో ఆటోలకు గిరాకీ లేక తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆటో కార్మికుల జీవనోపాధిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు పిల్లల విద్య, కుటుంబ భద్రతకు అవసరమైన ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ఆటో కార్మికులకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, కుటుంబ భద్రతా పథకాలను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.