Border – Gavaskar Trophy : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తరంగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ఆఖరి టెస్టుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనెసే ప్రత్యేక అతిథిగా రానున్నారు. వచ్చే నెలలో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ టెస్టును భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వీక్షించనున్నారు. ప్రధాని అయ్యాక మొదటిసారి భారత పర్యటనకు రానున్న ఆయన అహ్మదాబాద్ స్టేడియానికి వస్తారని సమాచారం. వ్యాపారం, పెట్టుబడులు, ముఖ్యమైన మినరల్స్ వంటి పలు అంశాలపై ఆయన ప్రధాని మోడీతో దౌత్యపరమైన చర్చలు జరిపే అవకాశం ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13 తేదీల మధ్య జరగనుంది. ఇప్పటికే రెండో టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా ఉంది. మార్చి 1న ఇండోర్ టెస్టులోనూ ఆసీస్‌ను ఓడించి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలి అనుకుంటోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరగనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనున్న భారత్‌కు బోర్డర్ – గవాస్కర్ సిరీస్ విజయం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన భారత్ ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పూజారాతో పాటు బౌలర్లు షమీ, సిరాజ్, ఆల్‌రౌండర్లు అశ్విన్, రవీంద్ర జడేజా కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నారు. దాంతో, ఈసారి ఐసీసీ టెస్టు గదను ముద్దాడేందుకు ఇండియా ఉవ్విళ్లూరుతోంది.