AUS vs ENG | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోర్‌ను సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ బ్యాట్‌తో వీర విహారం చేయడంతో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాకు 352 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంతకు ముందు 2004 ఓవెల్ మైదానంలో యూఎస్ఏపై న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. తాజాగా ఆ రికార్డును ఇంగ్లాండ్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌కు బెన్ ద్వార్షూయిస్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10), జేమీ స్మిత్ (15)ను తక్కువ స్కోర్‌కు పెవిలియన్‌కు పంపాడు. అయితే, బెన్ డకెట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ మ్యాచ్‌లో డకెట్ 143 బంతుల్లో 17 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 165 పరుగులు చేశాడు. డకెట్ రాణించడంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. జో రూట్ 78 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. మూడో వికెట్‌కు ఇద్దరు అజేయంగా 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోరుమీదున్న ఈ జోడీని ఆడమ్ జంపా విడదీశాడు. డకెట్, రూట్ తప్పా ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ తరపున కెప్టెన్ జోస్ బట్లర్ 23, జేమీ స్మిత్ 15, లియామ్ లివింగ్‌స్టోన్ 14, ఫిల్ సాల్ట్ 10, బ్రైడాన్ కార్స్ 8, హ్యారీ బ్రూక్ 3 పరుగులు చేశారు. అదే సమయంలో, జోఫ్రా ఆర్చర్ 10 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరలో ఆదిల్ రషీద్ కేవలం పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున, ఫాస్ట్ బౌలర్ బెన్ ద్వార్షూయిస్ 66 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు ఆడమ్ జంపా, మార్నస్ లాబుస్చగ్నే చెరో రెండు వికెట్లు దక్కాయి. గ్లెన్ మాక్స్వెల్ ఒక వికెట్ తీశాడు.