లీవ్, మార్చి 26: పౌరులే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖార్కీవ్లో ఆహారం కోసం క్యూలో నిల్చున్న పౌరులపై రష్యా బాంబు దాడిలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లీవ్ నగరంపై శనివారం రష్యా రెండు రాకెట్ దాడులు చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. మరియుపోల్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, నగరంలో వీధి పోరాటాలు జరుగుతున్నాయని నగర మేయర్ తెలిపారు. ఖేర్సన్ సమీపంలో జరిపిన దాడిలో రష్యాకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాన్‌త్సెవ్ మృతిచెందినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది. వాయువ్య ఉక్రెయిన్‌లోని జైతోమిర్ నగర సమీపాన ఉన్న ఆయుధ డిపోను నాలుగు క్యాలిబర్ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా తెలిపింది. మరోవైపు తొలి దశ యుద్ధం ముగిసిందని రష్యా ఆర్మీ ప్రకటించింది.
ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో పాటు ఉక్రెయిన్ రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులను వేర్వేరుగా కలిశారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సామగ్రి చేరవేత, ఇతర భద్రతా హామీలపై ఆండ్రెజ్‌తో చర్చించారని వైట్‌హౌస్ తెలిపింది. వార్సాలో ఉక్రెయిన్ శరణార్థులతో బైడెన్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒక ‘కసాయి’గా అభివర్ణించారు. తన అణ్వాయుధాల గురించి రష్యా ప్రగల్భాలు పలుకుతూ.. ప్రమాదకరమైన అణ్వాయుధ పోటీకి ఆజ్యం పోస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం దోహా ఫోరంలో వర్చువల్‌గా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆదివారం జరుగనున్న ఆస్కార్ వేడుకల్లో ఉక్రెయిన్ సంక్షోభంపై కూడా జెలెన్స్కీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఉక్రెయిన్ కమ్యూనికేషన్‌ను దెబ్బతీసేందుకు రష్యా మిలటరీ ఐరోపా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును హ్యాక్ చేసిందని అమెరికా ఆరోపించారు.