New Delhi : దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రేపిస్టులు ఆ బాలికను చంపేశారు. తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ ఘటన ఢిల్లీలోని స్వరూప్ నగర్లో గతవారం జరిగింది. గత ఆదివారం కుషాక్ రోడ్డు వద్ద కుళ్లిన స్థితిలో బాలిక మృతదేహం బయటపడటంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలివి.
స్వరూప్ నగర్ ప్రాంతంలో గత శుక్రవారం రాత్రి 16 ఏళ్ల బాలిక తన స్నేహితుడైన 17 ఏళ్ల యువకుడిని కలవడానికి వెళ్లింది. అతడి వద్దకు వెళ్లిన తర్వాత మరో ముగ్గురితో కలిసి ఆ బాలికను ఎత్తుకెళ్లారు. అనంతరం బాలికపై నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారం చేసి, తర్వాత హత్య చేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని కుషాక్ రోడ్డుపై ఒక ఖాళీ ప్రదేశంలో పడేశారు. రెండు రోజుల తర్వాత.. అంటే ఆదివారం ఆ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
వారు వచ్చి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే బాలిక మృతదేహాన్ని కొన్ని కుక్కలు, ఇతర జీవులు పీక్కుతిన్నాయి. ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. శరీరం కూడా చాలావరకు కుళ్లిపోయింది. దీంతో అప్పుడు బాలిక ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. బాలిక ఒంటిపై అనేక గాయాలున్నట్లు వ్యైద్యులు తెలిపారు. దీంతో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కోణంలో పోలీసులు విచారణ జరిపారు.
ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు. చివరకు నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకడి వయసు 19 ఏళ్లు కాగా.. మరో ముగ్గురు మైనర్లు. అందులో ఒకడు బాలిక స్నేహితుడైన 17 ఏళ్ల యువకుడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, అత్యాచారం, హత్య, పోక్సో వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.