హసన్‌పర్తి, సెప్టెంబర్ 5 : బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే లాగులూడేదాకా తరిమికొడతామని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల దగాపాలనను నిరసిస్తూ నాలుగో రోజు ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ కోసం శనివారం భీమారం జంక్షన్ నుంచి ఎర్రగట్టు గుట్టవరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అరూరికి వస్తున్న ఆదరణను ఓర్వలేక ర్యాలీని అడ్డుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు జంక్షన్లో డీజే పెట్టి రెచ్చగొట్టే యత్నం చేశారు. బీఆర్ఎస్ యూత్ మండల మాజీ అధ్యక్షుడు వల్లాల శ్రీకాంత్‌పై దాడిచేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది..ఈ క్రమంలో గంటపాటు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
కాంగ్రెస్ నాయకులు తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై వివిధ పార్టీల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తోపులాట జరిగిన కొద్ది సేపటి తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేయూసీ పోలీస్ స్టేషన్లో అరూరి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులపై దాడి సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. 97 జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.