న్యూఢిల్లీ: ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) ఇండియాలో టూర్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన వచ్చిన ఆయన.. ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో మనదేశ వ్యోమనౌకలో, మన దేశ రాకెట్ ద్వారా.. మన దేశ వ్యోమగామి.. అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష కేంద్ర అనుభవం వెలకట్టలేనిదని, అక్కడ ఎంతో నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపిస్తున్నదన్నారు. 1984లో ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ చెప్పినట్లు సారే జహాసే అచ్చా అన్న రీతిలోనే ఇండియా ఇప్పటికీ ఉన్నట్లు శుక్లా తెలిపారు.
#WATCH | Delhi | Group Captain Shubhanshu Shukla says, “… Bharat aaj bhi Antariksh se saare jahaan se achha dikhta hai. Jai Hind, Jai Bharat…” pic.twitter.com/mvq6zoGBqV
— ANI (@ANI) August 21, 2025
ఆక్సియం-4 మిషన్‌కు చెందిన ఫాల్కన్9 రాకెట్లో ప్రయాణించినట్లు శుభాంశు శుక్లా చెప్పారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో వ్యోమగాములు ఉన్నట్లు వెల్లడించారు. అంతరిక్షానికి మనుషులను తీసుకెళ్లే నౌకల్లో ఇదొకటి అని తెలిపారు. ఈ మిషన్‌లో తాను మిషన్ పైలట్‌గా చేసినట్లు చెప్పారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో మొత్తం నాలుగు సీట్లు ఉంటాయన్నారు. మిషన్‌కు పైలట్ కావడం వల్ల.. కమాండర్‌తో పని చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత క్రూ డ్రాగన్ సిస్టమ్స్‌తో ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుందన్నారు. భారతీయ పరిశోధకులు అభివృద్ధి చేసిన ప్రయోగాలను అక్కడ పర్ఫార్మ్ చేయాల్సి వచ్చిందన్నారు. స్టెమ్ డెమోలు, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం కూడా చేసినట్లు తెలిపారు.
శిక్షణ పొందిన దాని కన్నా ఎక్కువగా మానవ అంతరిక్ష మిషన్‌ను హ్యాండిల్ చేయాల్సి వస్తుందన్నారు. ఆ మిషన్‌లో భాగం కావడం వల్ల వచ్చే జ్ఞానం వెలకట్టలేనిదన్నారు. గత కొంత కాలం సేకరిస్తున్న సమాచారం .. మన దేశం చేపట్టే అంతరిక్ష ప్రయోగాలకు ఉపయుక్తంగా ఉంటుందని శుక్లా పేర్కొన్నారు. గగన్‌యాన్‌తో పాటు భారతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులో తన అభవనం కీలకం కానున్నట్లు చెప్పారు.తొందరలోనే మన క్యాప్సూల్ నుంచి మన రాకెట్ ద్వారా మన దేశ వ్యోమగామి అంతరిక్షం వెళ్తారన్నారు. గ్రౌండ్లో పనిచేసిన అనుభం చాలా భిన్నంగా ఉంటుందన్నారు. అంతరిక్ష ప్రయాణ సమయంలో మానవ శరీరం చాలా మార్పులకు లోనవుతుందన్నారు. 20 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటే, అప్పుడు శరీరాన్ని ఎలా గురుత్వాకర్షణలో ఉంచాలన్న విషయాన్ని మరిచిపోతుందన్నారు.