న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా కొనసాగుతున్న సంతాన సాఫల్య కేంద్రాలను, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఆర్ట్) క్లినిక్ల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సంతానం లేని వారికి విట్రో-ఫర్టిలైజేషన్, ఊసైట్ డొనేషన్ తదితర పద్ధతుల్లో సంతాన సాఫల్యతను కల్పించడమే లక్ష్యంగా ఆర్ట్ క్లినిక్లు ఏర్పాటయ్యాయి. అయితే, ప్రమాణాలను పాటించకుండా అనైతిక కార్యకలాపాలకు కొందరు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లును తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 20 లక్షల వరకు జరిమానా, గరిష్ఠంగా 12 ఏండ్ల జైలు వంటి కఠిన చర్యలు తీసుకునేలా బిల్లును రూపొందించారు.
పన్నెండు మంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కూడా ప్రతిపక్షాలు రాజ్యసభలో పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది.
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అక్రమాలను గుర్తించేందుకు ‘మీడియా కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని, దానికి చట్టబద్ధంగా విస్తృత అధికారాలను కల్పించాలని సమాచార, ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
పార్లమెంటు భవనంలో బుధవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. 59వ గదిలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదానికి కారణం తెలియలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.