
గణపురం, నవంబర్ 7: రోడ్డు ప్రమా దంలో ఏఎస్సై దుర్మరణం చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. రేగొండ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన హైవే పెట్రోలింగ్ వాహనం ఇసుక లారీని ఢీకొట్టింది. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కన్పించక పోవడంతో వెనుక నుంచి లారీని వేగంగా ఢీకొనడంతో పోలీస్ వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో రేగొండ ఏఎస్సై పోరిక హరిలాల్ నాయక్, డ్రైవర్ దబ్బెట అశోక్ తీవ్రంగా గాయపడగా, మరో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఏఎస్సై హరిలాల్నాయక్ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.