– ఏదులాపురం మున్సిపాలిటీలో కో ఆప్షన్ పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపు
– ఆరు నెలలు గడిచిన ఎంపిక కాని వైనం
– దరఖాస్తులకే పరిమితమైన ప్రక్రియ
ఖమ్మం రూరల్, ఆగస్టు 25 : ఏదులాపురం మున్సిపాలిటీ పాలకవర్గంలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఉంటుందా లేదా అనే సంశయం నెలకొంది. కో ఆప్షన్ ఉన్నప్పటికీ నేటి వరకు పాలకవర్గ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. సాధారణంగా మండల పరిషత్, మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి పాలకవర్గంలో జరిగే ప్రక్రియ. అయితే ఏదులాపురం మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పాటు జరిగి దాదాపుగా 6 నెలలు గడుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. మున్సిపాలిటీ కౌన్సిల్లో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులకు అవకాశం ఉందని కొద్ది నెలల క్రితం ఈఎంసి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి ముస్లిం మైనారిటీ కాగా, మరోకటి క్రిస్టియన్ మైనార్టీ, మూడవ అప్షన్ మేధావి వర్గం నుండి ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది.
కొద్ది నెలల క్రితం మున్సిపల్ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ వెలుబడిన వెంటనే ఆశావాహులు కొందరు తమ పూర్తి వివరాలతో మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశారు. మొత్తం మూడు ఖాళీలు ఉండగా తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా నేటి వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల ముందు వార్డు కౌన్సిలర్లుగా అవకాశం రానివారు, మున్సిపల్ బరిలో నిలిచి అపజయం పొందిన వారు కో ఆప్షన్ పోస్టులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఎంపిక ప్రక్రియపై క్లారిటీ రాకపోవడంతో అసలు కో ఆప్షన్ ఎంపిక ఉంటుందా లేదా అని డోలాయమానంలో పడ్డారు. కో ఆప్షన్ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలకు అనుగుణంగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. తుది ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు వెలువడిన తర్వాత ఎంపిక చేయడం జరుగుతుందని మున్సిపల్ వర్గాలు తెలుపుతున్నాయి.