ఢాకా: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి.. దేశంలో హాకీకి పూర్వవైభవం తీసుకొచ్చిన భారత పురుషుల జట్టు.. సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. తొలి పోరులో కొరియాతో తలపడనున్న భారత్.. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, జపాన్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం కెప్టెన్ మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘టోక్యో విశ్వక్రీడల తర్వాత మేము బరిలోకి దిగబోతున్న మొదటి టోర్నీ కావడంతో దీన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. తాజా సీజన్‌ను విజయంతో ఆరంభించాలనుకుంటున్నాం. యువ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. చాన్నాళ్ల ఎదురుచూపుల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న యంగ్ ప్లేయర్లు ఈ చాన్స్‌ను ఉపయోగించుకుంటారనుకుంటున్నా. భువనేశ్వర్‌లో నిర్వహించిన సన్నాహక శిబిరంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాం. ఈ టోర్నీ మా జట్టుకు పరీక్ష వంటిది. కొరియాను తక్కువ అంచనా వేయడం లేదు’ అని అన్నాడు.