Asia Cup | యూఏఈ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 ఆసియా కప్ టోర్నీ కోసం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ మల్టీ లాంగ్వేజ్ కామెంటేటర్స్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో పాటు పలువురిని ఎంపిక చేసింది. ఈ ఆసియా కప్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇక టీమిండియా యూఏఈతో తొలి మ్యాచ్ బుధవారం ఆడుతుంది.
ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన వ్యాఖ్యాతలలో భారత మాజీ ప్రధాన కోచ్ శాస్త్రి, గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, బాజిద్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అక్రమ్, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్ ఉన్నారు. హిందీ వ్యాఖ్యాతల ప్యానెల్లో సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, భారత మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, సబా కరీం ఉన్నారు. ఈ సందర్భంగా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చీఫ్ రెవెన్యూ ఆఫీస్ రాజేశ్ కౌల్ మాట్లాడుతూ ఈ ఆసియా కప్‌తో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తిరిగి క్రికెట్ ప్రసారాన్ని పునర్నిర్వచించుకుంటోందన్నారు. ఇక తమిళ కామెంటేటరీ ప్యానెల్లో డబ్ల్యూవీ రామన్ వంటి మాజీ ఆటగాళ్లతో భరత్ అరుణ్ చేరనుండగా.. తెలుగు ప్యానెల్లో వెంకటపతి రాజు, వేణుగోపాలరావు ఉండనున్నారు.
సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ విడుదల చేసిన ప్రకటనలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు ఆసియా కప్ ఆడబోతుందన్నారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వైవిధ్యం ఉందని.. దూకుడుగా ఉండే జట్టు భారత క్రికెట్ భవిష్యత్తును సూచిస్తుందని పేర్కొన్నారు. మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని, శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ భారత జట్టు అనుభవుమన్న ఆటగాళ్లు, యువకుల కలయికతో పటిష్టంగా ఉందన్నారు. జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారని.. తిలక్ వర్మ, హర్షిత్ రాణా వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారని తెలిపారు.