అంబర్ పేట, జూన్ 11 : విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం తీసు కున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకో వాలని ఎస్ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలోని 10 లక్షల కుపైగా పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళ్తుంటారని.. ఈ చార్జీల(20 శాతంపైగా) పెంపు ద్వారా వారిపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆర్టీసీ యాజమాన్యం నెలకు రూ.400 ఉన్న బస్ పాస్ చార్జీని రూ.600కు, 3నెలల ప్యాకేజీని రూ.1200 నుంచి రూ.1800కు పెంచుతూ పేద, మధ్యతరగతి విద్యార్థు లపై ఆర్థిక భారం మోపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ.. ఇప్పుడు బస్ పాస్ చార్జీల పెంపు సరికాదని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బస్ పాస్ చార్జీలను పెంచమని ప్రభుత్వం అంటుందని, విద్యార్థుల స్కాలర్ షిప్ ను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, పెంచిన బస్ పాస్ చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.