న్యూఢిల్లీ : ఇక నుంచి ఢిల్లీలో ఉచిత విద్యుత్ కావాలని కోరుకున్న వారికే అందుబాటులో ఉండనుంది. విద్యుత్ సబ్సిడీలు అవసరమని దరఖాస్తు చేసుకున్న వారికే వాటిని అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ వాసులు పలువురు వారి విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని, విద్యుత్ సబ్సిడీ వదులుకునే అవకాశం కోరుతున్నారని చెప్పారు.
ఉచిత విద్యుత్ కోరుకుని దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే పధకం అందుబాటులో ఉంటుందని కేజ్రీవాల్ బుధవారం స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పధకం కోరుకునేవారు మిస్డ్ కాల్ లేదా నిర్ధిష్ట నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయాలని చెప్పారు.
విద్యుత్ సబ్సిడీ కావాలనుకునే వారు దరఖాస్తు ఫారం నింపి అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ సబ్సిడీ ఇక ప్రతి ఏటా అందరికీ అందుబాటులో ఉండదు. విద్యుత్ సబ్సిడీని కొనసాగించాలా లేదా అనే ఆప్షన్ను విద్యుత్ వినియోగదారులే ఎంచుకోవాల్సి ఉంటుంది.