కడ్తాల్, ఫిబ్రవరి 25: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్లో ఎస్వోటీ, స్థానిక పోలీసుల దాడిలో కృత్రిమ పాల తయారీ గుట్టురట్టయింది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిచేడ్కు చెందిన అనగోని శ్రీశైలం అదే గ్రామంలో కొంతకాలంగా పాలను సేకరిస్తున్నాడు. రైతుల నుంచి సేకరించిన పాలకు తోడుగా గుట్టుగా కృత్రిమంగా కల్తీ పాలను తయారు చేస్తూ పలు ప్రైవేట్ డెయిరీలకు విక్రయిస్తున్నాడు.
పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం మహేశ్వరం ఎస్వోటీ, స్థానిక పోలీసులు రావిచేడ్లో శ్రీశైలం తయారు చేస్తున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఇందులో కృత్రిమ పాల తయారీకి ఉపయోగించే 45 డ్రైడ్ టీ, కాఫీ క్రీమర్, 12 సాల్ట్ ప్యాకెట్లు, లూజ్ షుగర్, ఆరు క్యాన్ల కల్తీ పాలు (240 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను షాద్నగర్లో కొనుగోలు చేసినట్టు సమాచారం.