న్యూఢిల్లీ: దాదాపు 53 ఏండ్ల తరువాత మానవులు మరోసారి జాబిల్లి చెంతకు చేరారు. గత అర్ధశతాబ్ద కాలంలో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రతి మానవుడూ విశ్వపు ఉపరితలాన్ని స్పృశించి వచ్చాడు తప్ప, అది దాటి అవతలికి వెళ్లలేదు. కానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరారు. వారిని తీసుకెళ్లిన ఓరియన్ వ్యోమనౌక ఈ నెల 6న 4,06,773 కిలోమీటర్లు ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కంటే ఇది 2,500 కిలోమీటర్లు అదనం. వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ నెల 7న అర్ధరాత్రి 12:15కు చంద్రుడి సమీపం నుంచి తిరుగు ప్రయాణం కానున్నది. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భూకక్ష్యలో 400 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చంద్రుడు భూమికి 3,84,633 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇంతకుముందు అపోలో-13 4,00,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా, ఆర్టెమిస్-2 మరో 2,500 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణించనుంది. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తిచేశాక వ్యోమనౌక ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ కావచ్చు.