బీజింగ్, ఏప్రిల్6: టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నాయి. చైనాలో ఈ వ్యవహారం కాస్త భిన్నంగా సాగుతున్నది. చైనాకు చెందిన కంపెనీల్లో కొంతమంది ఉద్యోగులు ఏఐ టెక్నాలజీతో సహ ఉద్యోగుల ఉద్యోగాల్ని దెబ్బతీస్తున్నారట. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం ఉద్దేశించిన వేదిక ‘గిట్‌హబ్’లో ‘కొలిగ్.స్కిల్’ అనే టూల్‌పై సాగుతున్న చర్చ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ టూల్‌ను ఉపయోగించి సహ ఉద్యోగి పని విధానాన్ని, నిర్ణయాల్ని మొత్తం విశ్లేషిస్తారు. అతడి డాటాను తీసుకుంటారు. అనంతరం ఆ ఉద్యోగిలా ప్రవర్తించే ఏఐ వ్యవస్థకు శిక్షణ ఇస్తారు. తద్వారా వారి ఉద్యోగాలను ఆటోమేట్ చేస్తారు. దీంతో తమ సొంత ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయని చైనా ఉద్యోగులు భావిస్తున్నారట. ‘కొలిగ్.స్కిల్’ అనే టూల్‌ను చైనా కంపెనీల్లో కొంతమంది తమ సహ ఉద్యోగులకు వ్యతిరేకంగా వాడినట్టు తేలింది.
ఒక వ్యక్తి పనులు, నిర్ణయాలు, నైపుణ్యాలు, పద్ధతుల్ని విశ్లేషించి విడగొడతారు. దీంట్లోని శక్తివంతమైన జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఒక చిన్న ‘ఏఐ నమూనా’కు బదిలీ చేయటాన్నే ‘స్కిల్ డిస్టిలేషన్’ అంటారు. చైనా కంపెనీల్లో ఇది రోజురోజుకీ విస్తరిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆఫీస్‌లో తాము చేస్తున్న పనిని డాక్యుమెంట్ చేయాలని, వర్క్‌ఫ్లో, డెషిషన్ మేకింగ్ సహా అంతా దాంట్లో ఉండాలని కంపెనీలు ఉద్యోగులను కోరుతుంటాయి.
ఇదే డాటాతో ‘కొలిగ్.స్కిల్’ అనే టూల్‌తో ‘ఏఐ వ్యవస్థల్ని’ తీర్చిదిద్ది, సహ ఉద్యోగి చేస్తున్న జాబ్ రోల్‌ను ‘అనవసరం’గా మార్చుతున్నారు. దీనికి కౌంటర్‌గా చైనాకు చెందిన ఒక మహిళా డెవలపర్ ‘యాంటీ డిస్టిలేషన్.స్కిల్’ అనే దాన్ని కూడా తయారుచేసింది. తమ స్థానాన్ని ఏఐ వ్యవస్థతో కంపెనీ భర్తీ చేయకుండా ఇది సదరు ఉద్యోగిని కాపాడగలదని ఆమె చెబుతున్నది.