కందుకూరు, ఆగస్టు 25: నకిలీ పత్రాలు సృష్టించి భూ యజమానులను మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన పొలిశెట్టి మల్లికార్జున్, కందుకూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, జూబ్లీహిల్స్‌కు చెందిన వడలా రాజేంద్రనాధ్, పుప్పాల్‌గూడకు చెందిన ఎడిక మంజునాథ్‌రెడ్డి నకిలీ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ పత్రాలు సృష్టించారు. కందుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 151,152, 153,165,166లో ఉన్న 31 ఎకరాల 36 గుంటల భూమికి సంబంధించిన యజమానుల సంతకాలను ఫోర్జరీ చేశారు.
భూ యజమానుల అనుమతి లేకుండానే ఫోర్జరీ సంతకాలతో ‘డెవలప్మెంట్, అగ్రిమెంట్ కమ్ ఇర్రెవొకబుల్ జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ’ని సృష్టించారు. సదరు భూ యజమానులు ఆ భూములను అభివృద్ధి చేసేందుకు, లే అవుట్ వేసేందుకు తమకు అనుమతి ఇచ్చారంటూ నకిలీ పత్రాలు సృష్టించారు. కందుకూరు గ్రామానికి చెందిన ఐనవోలు శ్యాంసుందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయడంతో ఈ వ్యవహారం బయటపడిందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.