తిరుమల : నారాయణవనంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) అత్యంత వైభవంగా జరుగనున్నాయని టీటీడీ ఈవో రవిచంద్ర ( EO Ravichandara ) తెలిపారు. మే 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 27న అంకురార్పణం, జూన్ 4న దివ్య కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాలకు సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఏర్పాట్లు చేపట్టాలని, భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్, ఆలయ పరిసరాల్లో ఆహ్లాదకర రంగోలీలు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సాంప్రదాయ పెయింటింగ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు, అమ్మవారు వివిధ దివ్య వాహనాలపై దర్శనం ఇవ్వనున్నారని వివరించారు. మే 28న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, మే 29న చిన్నశేష వాహనం, హంస వాహనంపై స్వామివారు ఊరేగుతారని పేర్కొన్నారు.
మే 30న సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, మే 31న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, జూన్ 1న మోహినీ అవతారం, గరుడ వాహనం, జూన్ 2న హనుమంత వాహనం, గజ వాహనంపై , జూన్ 3న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, జూన్ 4న రథోత్సవం, అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. అదే రోజు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
జూన్ 5 న చక్రస్నానం, ధ్వజావరోహణంతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, తదితర అధికారులు పాల్గొన్నారు.