యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పంచ కుండాత్మక, మహాకుంభ సంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లపై ఆలయ అర్చకులు, అధికారులు దృష్టి సారించారు. స్వామి ప్రతిష్ఠాముహూర్త సందర్భాన్ని పురస్కరించుకుని నూతన గర్భాలయం, అంతరాలయం, మహామండపంలోని ఉపాలయాలు, మూర్తుల పరిశుద్ధి కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు శనివారం చేపట్టారు. సుమారు 2గంటల పాటు ప్రధానాలయం, గర్భాలయంలో పరిశుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకమైన జలాలతో శుద్ధి చేశారు. అనంతరం మహా మండపంలోని గోదాదేవి, రామానుజం, ఆళ్వారు, శైవమండపం, ఉపాలయాలతో పాటు శరణాలయాలను శుద్ధి చేసి సిద్ధం చేశారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఇప్పటికే ఆలయంలోనే ఉన్న ఆండాళ్ అమ్మవారు, రామానుజం, ఆళ్వారు విగ్రహాలకు జలాభిషేకం, ధాన్యాభిషేకాలు చేసి ఉపాలయాల్లో ప్రతిష్ఠించనున్నారు.
బాలాలయంలో ఈ నెల 21న ప్రారంభమయ్యే పంచ కుండాత్మక మహాయాగానికి కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అర్చకులు, అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా బలాలయంలో యాగశాల నిర్మాణం పూర్తయ్యింది. కుంభ స్థాపనలకు ఆలయ అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాయాగానికి కావాల్సిన వస్తు సామగ్రిని అధికారులు సేకరించారు. పంచ కుండాత్మక మహాయాగంలో ఎవరెవరూ ఏ కార్యక్రమం చేపట్టాలో అర్చకులంతా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.