నల్లగొండ, ఫిబ్రవరి 10 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో ఏర్పాటు చేసిన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా సిబ్బందితో మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పిఓ డైరీ జాగ్రత్తగా రాయాలన్నారు. పోలింగ్ రోజున ఉదయం 6:45 గంటలకు ఏజెంట్ల ఎదురుగా బ్యాలెట్ బాక్స్ ను తెరవడం చేయాలన్నారు.
అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ నెల 11న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, 161 వార్డులకు సంబంధించి 473 పోలింగ్ కేంద్రాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుందని, హాలియా మున్సిపాలిటీలోని 10వ వార్డు ఎన్నిక ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. 3 లక్షల 9 వేల 97 మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకుగాను ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ఓటరు చీటీలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సవ్యంగా నిర్వహించేందుకు సిబ్బందిని నియమించడంతో పాటు, ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం జరిగిందని, డీఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ బి.చంద్రశేఖర్
మున్సిపల్ ఎన్నికలకు 2,855 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోవడం జరుగుతున్నదని, వీరందరికీ శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. డీఆర్సీ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిబ్బందికి బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించామని, గత మున్సిపల్ ఎన్నికల్లో 79.5% ఓట్లు పోల్ కాగా, ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 89% ఓట్లు పోలయ్యాయని, పోలింగ్ ను పెంచేందుకు గాను అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఆడియో క్లిప్ ద్వారా ఓటు వేసే విధంగా అవగాహన కల్పిస్తున్నామని, ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఆర్జాలబావి వద్ద ఉన్న ఎస్‌డబ్ల్యూసీ గోదాంలో నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్ఎల్బీసీ సమీపంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలిక రెసిడెన్షియల్ పాఠశాలలో, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని, ఎక్కడైనా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నట్లయితే తక్షణమే స్పందించి సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ ఓటర్లు అందరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.