మెదక్ : మున్సిపల్ ఎన్నికలను ( Municipal Elections) ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ( SP D.V. Srinivasa Rao ) తెలిపారు. శుక్రవారం మెదక్, రామాయంపేట మున్సిపాల నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందులో 21 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 ఎస్ఎస్టీలు, 4 ఎఫ్ఎస్టీలు తనిఖీలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎవరైనా ఎన్నికల సమయంలో కావాలని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఎస్పీ పరిశీలించారు.
డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమంగా మద్యం విక్రయం, పంపిణీ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు చెప్పడుతామని తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారుల లిఖితపూర్వక అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, మైక్ సెట్లు లేదా శబ్ద కాలుష్యం కలిగించే పరికరాలు వినియోగించరాదని స్పష్టం చేశారు.
గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి, సుమారు 1,200 మందిపై ముందస్తుగా బైండోవర్ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్సైలు బాలరాజ్, రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.