హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ వద్ద నిర్మించిన బౌద్ధ క్షేత్రం బుద్ధవనం ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బుద్ధవనం ప్రాజెక్టు, మన్యంకొండ దేవాలయం, నేలకొండపల్లి, ఫణిగిరి బౌద్ధ క్షేత్రాల పనుల పురోగతిపై సమీక్షించారు. నాగార్జునకొండకు సమాంతర బుద్ధిజం చరిత్ర కలిగిన చాకలిగట్టు ఐలాండ్ అభివృద్ధికి డీపీఆర్ రూపొందించి సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుద్ధవనం ప్రాజెక్టుతోపాటు చాకలిగట్టును కూడా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక మన్నెంకొండ లక్ష్మీవేంకటేశ్వర దేవాలయం వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్కియాలజీ మ్యూజియం ఏర్పాటుకు కూడా డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. హైదరాబాద్ మహా నగరంలో తెలంగాణ చరిత్ర, సంసృతి ప్రతిబింబించేలా సుమారు 25 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో మ్యూజియం నిర్మించేందుకు డీపీఆర్ రూపొందించి, కేంద్ర పురావస్తుశాఖకు పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, చరిత్రకారులు శివనాగిరెడ్డి, బుద్ధవనం ఓఎస్డీ సుభాన్‌రెడ్డి పాల్గొన్నారు.