కోల్‌కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ.. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దర్నీ విచారించిన ఈడీ 172 పేజీల ఛార్జిషీట్ తయారు చేసింది. దాంట్లో కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. తల్లి కావాలనుకున్న అర్పిత ముఖర్జీ.. ఓ శిశువును దత్తత తీసుకోవాలని అనుకున్నది. అయితే ఆమె కోరికను మాజీ మంత్రి పార్థా ఛటర్జీ తీర్చారు. దత్తతకు సంబంధించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను మంత్రి జారీ చేశారు. శిశువు దతత్తకు సంబంధించిన లేఖపై మంత్రి పార్థా సంతకం చేసినట్లు ఈడీ తన ఛార్జిషీట్లో తెలిపింది. అయితే దత్తత లెటర్‌ను అర్పిత ఇంటి నుంచి తనిఖీల సమయంలో రికవరీ చేసినట్లు ఈడీ కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో తెలిపింది.
మాజీ మంత్రి పార్థ స్నేహితురాలు అర్పితకు చెందిన దక్షిణ కోల్‌కతా అపార్ట్మెంట్లో ఈడీ అధికారులు సోదా చేసి సుమారు 21 కోట్ల నగదు, ఇతర దస్తావేజులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దత్తత కోసం సమర్పించిన లెటర్లో.. అర్పితకు సన్నిహితమైన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ మంత్రి పేర్కొన్నారు. దీని గురించి ఈడీ విచారిస్తే.. ఎంతో మందికి లేఖలు ఇస్తుంటామని, ఇది కూలా అలాంటి లేఖే అని పార్ధా అన్నట్లు తెలుస్తోంది. లెటర్ కింద ఉన్న సంతకం తనదే అని పార్ధా ఛటర్జీ అంగీకరించినట్లు ఈడీ తన ఛార్జిషీట్లో తెలిపింది.