న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉన్న సైనిక దళాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇవాళ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. ఎంత మంది సైనికుల్ని తరలించారన్న దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ జోషీమఠ్ ప్రాంతంలో ఉన్న సుమారు 20 సైనిక క్షేత్రాలు స్వల్ప స్థాయిలో డ్యామేజ్ అయినట్లు ఆయన వెల్లడించారు. అవసరమైతే మరికొన్ని దళాల్ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయన చెప్పారు.
చైనాతో ఉన్న సుమారు 3488 కిలోమీటర్ల బోర్డర్‌ను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద దాదాపు 20 వేల మంది సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రాంతంలో మిలిటరీ హార్డ్‌వేర్‌తో పాటు ఆర్టిల్లరీ, మిస్సైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి.
జోషీమఠ్‌లో అనేక ఇండ్లలో పగుళ్లు వచ్చాయి. దీంతో అక్కడ నుంచి ప్రజల్ని తరలించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్కడ ఓ రోజు బస కూడా చేశారు. ఇక కొన్ని హోటళ్లను కూల్చివేయాలని కూడా నిర్ణయించారు. అయితే స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 16వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.