నాగ్‌పూర్, అక్టోబర్ 22: మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో ‘దృశ్యం’ సినిమా తరహాలో ఓ హత్య జరిగింది. నగరానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి, సినిమాలో చూపించినట్టు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ హత్య జరిగిన తీరు పోలీసులను సైతం షాక్‌కు గురిచేసింది. ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్న నిందితుడు అజయ్ వాంఖెడే (33)ను నాగ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని నాగ్‌పూర్‌లో ఓ రహస్య ప్రదేశంలో పాతిపెట్టాడు. దాన్ని సిమెంట్‌తో కప్పేశాడని పోలీసులు వివరించారు. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో హాయిగా కొన్నాళ్లు గడిపాడు. వారి వివాహానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవటంతో, ఆమెను వదిలించుకునేందుకు హత్యకు ప్లాన్ చేశాడు’ అని పోలీసులు చెప్పారు. ఆమె కనిపించటం లేదని కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆగస్టు 29న ఫిర్యాదు చేశారు. మ్యారేజ్ పోర్టల్ ద్వారా పరిచయమైన జోత్స్న ఆక్రే అనే మహిళను మత్తుమందు ఇచ్చి.. గొంతుకోసి చంపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
నస్రల్లా బంకర్లో 4 వేల కోట్లు
జెరూసలేం, అక్టోబర్ 22: మరణించిన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా బంకర్లో భారీగా నగదు, బంగారం ఉన్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి డానియెల్ హగరి ఆరోపించారు. గత నెల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ దవాఖాన కింద నస్రల్లా నివసించిన బంకర్ ఉందని, అందులో దాదాపు 50 కోట్ల డాలర్ల(రూ.4,200 కోట్లు) విలువైన బంగారం, నగదు ఉన్నట్టు డానియెల్ మంగళవారం పేర్కొ న్నారు. ఇందుకు సంబంధించిన గ్రాఫిక్ వీడియో, ఫొటోలను విడుదల చేశారు. అయితే, దవాఖాన కింద ఉన్నందున ఈ బంకర్‌ను తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని తెలిపారు. ఈ డబ్బు లెబనాన్ ప్రజల పునరా వాసం కోసం ఉపయోగించవచ్చని, కానీ హెజ్బొల్లా పునరావాసం కోసం మళ్లించారని ఆరోపించారు.