Shalini Pandey | ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండకు ఎంత పేరొచ్చిందో, షాలినీ పాండేకూ అంతే గుర్తింపు వచ్చింది. కొత్త అమ్మాయి అయినా సహజంగా చేసిందని మెచ్చుకున్నారంతా. బోణీ బావుండటంతో.. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు కొట్టేసింది. తన అమాయకపు చూపులతో అందరినీ ఆకట్టుకునే షాలినీ పాండే ముచ్చట్లు..
మాది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్. ఇంజినీరింగ్ తర్వాత ఏదైనా కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడిపోవాలని అమ్మానాన్న కోరుకున్నారు. కానీ, నాకు సినిమాలంటే ఇష్టం. ఆ విషయం తెలిస్తే ఎక్కడ తిడతారో అన్న భయంతో ఇంట్లోవాళ్లకు తెలియకుండా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా ఫేస్బుక్ పోస్ట్ చూసి దర్శకుడు సందీప్ వంగా ఆడిషన్‌కు పిలిచారు.
హైదరాబాద్‌కు రానైతే వచ్చాను కానీ, నామీద నాకే నమ్మకం లేదు. ఇక్కడ ఎవరూ తెలీదు. అంతా కొత్తే. కానీ ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు నన్నే ఎంపిక చేశారు. అలా అనుకోకుండా నా ప్రయాణం మొదలైంది. ఆ సమయంలో తెలుగు తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అదృష్టంకొద్దీ ‘అర్జున్ రెడ్డి’ ఘనవిజయం సాధించింది. ప్రీతి పాత్ర అందరికీ నచ్చింది. మా అమ్మానాన్న ఇప్పటికీ ఆ పేరుతోనే పిలుస్తుంటారు.
‘ఏం చేస్తావో తెలియదు. నువ్వు అచ్చమైన దక్షిణాది అమ్మాయిగా మారిపోవాలి’ అని చెప్పారు దర్శకుడు. తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. మొదట కష్టంగా అనిపించినా, క్రమంగా అలవాటైపోయింది. ‘అర్జున్ రెడ్డి’తోనే గ్లిజరిన్ లేకుండా ఏడ్వటం నేర్చుకున్నా.
‘మహానటి’, ‘ఎన్టీఆర్ (కథానాయకుడు)’, ‘118’ చిత్రాలతోపాటు ద్విభాషా చిత్రం ‘సైలెన్స్’లో చిన్నపాత్ర అయినా ఇష్టపడి చేశాను. ‘జయేష్‌భాయ్ జోర్దార్’లో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించాను. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న ‘మహారాజా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నా.
బాలీవుడ్లో నా మొదటి సినిమా ‘బామ్ఫాద్’ను కూడా చాలామంది విమర్శించారు. ఎందుకంటే ఆ సినిమాలో నేను గర్భిణిని. ఆ పాత్రకోసం నా శరీరాన్ని మార్చుకున్నా. ఎవరైనా మంచి గ్లామర్ ఉన్న పాత్రతో పరిచయం కావాలనుకుంటారు. నాకు మాత్రం అలాంటి పట్టింపులు లేవు.
మనది ఇండియన్ సినిమా. ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడం మానుకోవాలి. ఈ మధ్య దక్షిణాది సినిమాలు కూడా ఉత్తరాదిన ఘన విజయం సాధిస్తున్నాయి. మంచి సినిమాలు ఎక్కడైనా ప్రజాదరణ పొందుతాయి. నేను కమల్‌హాసన్ వీరాభిమానిని. ‘చాచీ 420’ చూసినప్పటినుంచీ ఆయనంటే ఇష్టం ఏర్పడింది. కమల్జీలోని కామెడీ టైమింగ్, యాక్షన్ బాగా ఎంజాయ్ చేస్తాను. రేఖ, మాధురీ దీక్షిత్, కరీనా, ప్రీతీ జింతా.. నేను ఆదర్శంగా తీసుకునే నటులు చాలామందే ఉన్నారు. ప్రస్తుతానికి పెండ్లి ఆలోచనలు లేవు. కెరీర్ మీదే దృష్టి పెడుతున్నా.
“Shalini Pandey | బికినీలో హీటెక్కిస్తున్న షాలిని పాండే..”