e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News హైద‌రాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్త‌ర‌కం స్వీట్ గురించి తెలుసా?

హైద‌రాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్త‌ర‌కం స్వీట్ గురించి తెలుసా?

arab sweets baklava | జిలేబీ బోర్‌ కొట్టేసింది.. మైసూర్‌ పాక్‌ మొహం మొత్తింది. బాదుషా.. పాదుషాల కాలంనాటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్వీట్ల జాబితాలో చేరిపోయింది. జాంగ్రీ పేరెత్తితే చాలు ‘నో హంగ్రీ’ అంటున్నారు. దీంతో, మిఠాయి తయారీదారులు వ్యాపారం పెంచుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. సరికొత్త రుచులు పరిచయం చేస్తున్నారు. వీలైతే పాత మిఠాయిలకే ‘మేకోవర్‌’ చేస్తున్నారు. ఆ ట్రెండ్‌లో భాగంగానే హైదరాబాద్‌లో అరబ్‌ స్వీట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.

arab sweets baklava
arab sweets baklava

బక్లవా ( baklava ).. పేరు విన్నారా? రుచి చూశారా? హైదరాబాదీలు ఆవురావురుమని ఆరగిస్తున్న సరికొత్త రుచి ఇది. మధ్య ఆసియా దేశాల్లో అయితే, ఆ పేరు చెబితేనే.. నోరు చెరువు అవుతుంది. పిస్తా, వాల్‌నట్‌ మొదలైన డ్రై ఫ్రూట్ల తరుగుతో తయారు చేస్తారు దీన్ని. చక్కెర పాకం లేదా తేనెలో ముంచితేల్చి కమ్మకమ్మగా తీయతీయగా వడ్డిస్తారు. పండుగ రోజుల్లో బక్లవా ( baklava ) రకరకాల ఆకారాల్లో, వివిధ రుచుల్లో ఊరిస్తున్నది. డ్రై ఫ్రూట్‌ బక్లవా, మిద్యే బక్లవా, మోతీచూర్‌ బక్లవా, కోవా బక్లవా.. తీరొక్క రుచి, తీరొక్క మాధుర్యం! కాకపోతే ధర ఎక్కువే. పాల కోవా అంత సున్నితంగా ఉంటాయీ స్వీట్స్‌. తీపి మోతాదు కాస్త తక్కువే.

- Advertisement -

నిన్న మొన్నటి వరకూ కోవా, బర్ఫీ వగైరా సంప్రదాయ మిఠాయిలకే పరిమితమైన పుల్లారెడ్డి స్వీట్స్‌ లాంటి దుకాణాలు కూడా బక్లవా ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి. అరబ్‌ రుచులకూ చోటు కల్పిస్తున్నాయి. ఆల్మండ్‌ హౌస్‌ ఇప్పటికే ‘జై బక్లవా’ నినాదం ఎత్తుకుంది. ‘దక్షిణ భారత మిఠాయిలైన అరిసెలు, పూతరేకులు, మడత కాజాలతో పాటు వివిధ రకాల లడ్డూలు, బర్ఫీలకూ ఈ ఏడాది గిరాకీ పెరిగింది. కాకపోతే, ఆత్మీయులకు పండుగ కానుకగా అందించే బహుమతుల్లో బక్లవాలను ఎక్కువగా కొంటున్నారు. మా షాపులో కూడా దీనికోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ ఏర్పాటు చేశాం’అంటున్నారు పుల్లారెడ్డి స్వీట్స్‌ స్టోర్‌ మేనేజర్‌ కుమార్‌.

‘ఆత్మీయులకు తీయని సర్‌ప్రైజ్‌ ఇవ్వడంలో వీటికి తిరుగులేదు. ఈ ఏడాది పండగ సీజన్‌లో హనీ బక్లవా హల్‌చల్‌ చేస్తున్నది’అంటారు బంజారాహిల్స్‌లోని ఓ అరబ్‌ మిఠాయిల దుకాణం యజమాని. కొత్తగా టర్కిష్‌, మధ్య ఆసియాల పిండి వంటలనూ పరిచయం చేస్తున్నారు ఆయన. ఆఫ్గాన్‌ సంక్షోభంతో ఎండు ఫలాల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో డ్రైఫ్రూట్‌ మిఠాయిల రేట్లూ పెరిగాయి. కాబట్టే, సహజంగానే ఖరీదైన మిఠాయి అయిన బక్లవా ఎంతోకొంత చౌకగా అనిపిస్తున్నది. దీంతో అమాంతం గిరాకీ పెరిగిపోయింది. దీనికితోడు, కొత్తకు పట్టం కట్టే హైదరాబాదీల జిహ్వ చాపల్యమూ తోడైంది.

ఇతర రాష్ట్రాల రుచులూ

హైదరాబాద్‌ అంటేనే భిన్న జాతుల సంగమం. ఏ నారాయణ గూడ చౌరస్తాలోనో నిలబడితే.. తెలుగు తేనె, కన్నడ కస్తూరి, మరాఠీ దూద్‌పేడా, మలయాళ పాన్‌బీడా ఇలా దేశంలోని భాషలన్నీ వినిపిస్తాయి. నోటికో భాష ఉన్నప్పుడు, జిహ్వకో రుచి మాత్రం ఉండదా? ఉండి తీరుతుంది. దీంతో వివిధ రాష్ర్టాల ప్రత్యేక వంటకాలకు పాకశాలగా మారింది హైదరాబాద్‌. వీటిలో చాలావరకూ మిఠాయి దుకాణాల్లో లభించకపోయినా.. హోమ్‌షెఫ్‌లు తాజా తాజాగా వండి పంపుతున్నారు. జార్ఖండ్‌ అనార్స, పంజాబ్‌ పిన్ని, రాజస్థాన్‌ ఘేవర్‌, కర్ణాటక హోళిగె, గుజరాత్‌ కన్సర్‌, మహారాష్ట్ర కారంజి.. భారతీయ రుచుల జాబితాలో కనిపించే ప్రతీ వంటకం ఇక్కడ సిద్ధమే. నచ్చిన మిఠాయితో నోరు తీపి చేసుకోవచ్చు. ఘనంగా దీపావళి జరుపుకోవచ్చు.

లడ్డూ కావాలా బాబూ!

లడ్డూ.. పెండ్లి విందులో ఉండాల్సిందే. పార్టీ వంటకాల్లో భాగం కావాల్సిందే. చుట్టపుచూపుగా వెళ్తున్నప్పుడూ తీసుకెళ్లాల్సిందే. అంతెందుకు బొద్దుగా ఉండే బాబునో, పాపనో ‘లడ్డూ’ అనే పిలుస్తాం. ఒకప్పుడు బూందీ లడ్డూ, మోతీచూర్‌ లడ్డూ తప్ప వేరేరకం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మార్కెట్లో అనేక రూపాల్లో, అనేక రుచులతో దర్శనం ఇస్తున్నాయి. చాక్లెట్‌, బ్లూబెర్రీ, సాల్టెడ్‌ క్యారామెల్‌, లావెండర్‌.. ఇలా రకరకాల లడ్డూలు మిఠాయిల దుకాణంలో సిద్ధం అవుతున్నాయి. కొంతమంది షెఫ్‌లు వైవిధ్యంగా రెడ్‌వైన్‌, షాంపేన్‌ లడ్డూలూ తయారు చేస్తున్నారు.

స్వీటువీరుడు.. మిఠాయిలకు సంబంధించి..

‘గూగుల్‌ ట్రెండ్స్‌’ స్కోర్‌ ప్రకారం.. రసగుల్లాకు 71 మార్కులు, గులాబ్‌ జామ్‌కు 61 మార్కులు, బర్ఫీకి 57 మార్కులు, కాజూ కట్లీకి 34 మార్కులు వచ్చాయి. సోన్‌ పాపిడి మాత్రం అత్తెసరు స్కోరుతో అట్టడుగున బిక్కు బిక్కుమంటున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి :

Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

donne biryani | హైద‌రాబాద్‌లో నోరూరించే దొన్నె బిర్యానీ.. ఎక్క‌డ దొరుకుతుందంటే..?

Nalli Biryani : మూలుగ బొక్కల‌ బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? హైద‌రాబాద్‌లో ఇప్పుడు ఈ బిర్యానీయే ఫేమ‌స్‌

Biryani | బిర్యానీ వెనుక ఇంత క‌థ ఉందా..? వీడియో

Prawn Biryani | హైద‌రాబాదీ బిర్యానీల్లో న‌యా ట్రెండ్‌ రొయ్య‌ల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..

అదిరిపోయే అరేబియ‌న్ మండి బిర్యానీ.. హైద‌రాబాద్‌లో ఎక్క‌డ దొరుకుతుందంటే..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement