మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటూ దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్లో ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఇందిరమ్మ ఇంటి పథకానికి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు పథకం లబ్ధిదారుల ఎంపిక మాత్రం జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ పథకానికి సంబంధించి 1,10,436 దరఖాస్తులు వచ్చాయి. కాగా నియోజకవర్గానికి 3500 చొప్పున 5 నియోజకవర్గాలకు 17,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.
ఏకపక్షంగా ఇందిరమ్మ కమిటీల నియామకం..
ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీలను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. అయితే ఈ కమిటీల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ వారినే నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు పారదర్శకంగా వ్యహరించే అవకాశం లేదని దీంతో అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తించే అవకాశం లేకుండా పోతుందన్న ఆందోళనను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి 3500 మందిని మాత్రమే పథకానికి ఎంపిక చేస్తే మరి.. మిగతా వారి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. కాగా ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయంపై ఇప్పటి వరకు అధికారులకు ఎలాంటి క్లారిటీ లేదని తెలుస్తోంది.