AP Weather | ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వార్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.గురు, శుక్ర వారాల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.