AP News : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదని, ఒకవేళ గెలిస్తే ‘నేను ఆయన బూట్లు తుడుస్తా’ అని కొడాలి నాని మంత్రి హోదాలో అన్నారని ఎమ్మెల్యే రాము గుర్తుచేశారు. ముందుగా చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని రాజకీయాల గురించి మాట్లాడాలని అన్నారు. కొడాలి నాని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడటంపై రాము విమర్శలు చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కొడాలి నాని కార్పొరేటర్‌గా కూడా గెలవలేడని ఎమ్మెల్యే రాము వ్యాఖ్యానించారు. నానీకి దమ్ముంటే కార్పోరేటర్‌గా పోటీచేసి గెలువాలని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానిని గుడివాడ ప్రజలు 53 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారని, అయినా ఆయనకు బుద్ధి రాలేదని రాము అన్నారు. విజయవాడలో మీడియా ముందు మాట్లాడటం కాదని, దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. గుడివాడలో నాని సీటు గల్లంతయిందని, అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని చెప్పారు.
గుడివాడ ప్రజలు నానిని ఎప్పుడో మర్చిపోయారని రాము అన్నారు. జనాలు ఛీ కొడుతున్నా కొడాలి నాని సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నానీ.. చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావో చెప్పు అని నిలదీశారు. గుడివాడ రాజకీయాలపైనే పట్టులేని కొడాలి నానికి రాష్ట్ర రాజకీయాలు అవసరమా..? అని ఎద్దేవా చేశారు.