AP News | ఏపీలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతుందని మంత్రి కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 1.5గానే ఉందని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఏపీలో యువత కూడా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఏపీలో సగటు వయసు 32.5 ఉందని కొలుసు పార్థసారథి తెలిపారు. 2047 వచ్చేసరికి ఇది 40 ఏళ్లు కానుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో యువకుల వయసు తగ్గి.. పెద్ద వయసు వాళ్ల జనాబా పెరిగేపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు ఓల్డ్ ఏజ్ హోమ్స్‌గా మారిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ సమతుల్యం తగ్గడం, సంతానోత్పత్తి తగ్గుతుందన్న పరిస్థితులపై మంత్రివర్గ భేటీలో చర్చించామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మున్సిపల్, పంచాయతీ పరిధిలో ఇద్దరికి మించి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
మున్సిపల్, పంచాయతీ పరిధిలో ఇద్దరికి మించి ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధిస్తూ.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లో చేసిన చట్టసవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని కొలుసు పార్థసారథి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇలాంటి నిబంధనే ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. 1980, 90 దశకాల్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ చట్ట సవరణ తీసుకొచ్చారని చెప్పారు. సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన సవరణకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు.