హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఏపీ స్థానికత గల టీచర్లు ఆ రాష్ర్టానికే వెళ్లేందుకు తెలంగాణ సర్కారు శుక్రవారం నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) జారీచేసింది. 578 మంది టీచర్లు ఏపీకి వెళ్లేందుకు ఎన్వోసీలు ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో ఏపీ స్థానికత గల వారిని ఏపీకి వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సీఎస్ సోమేశ్‌కుమార్ మె మో జారీచేశారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖలోని 578 మంది ఏపీ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తులను పరిశీలించిన విద్యాశాఖ వీరు ఏపీకి వెళ్లేందుకు ఎన్వోసీలను జారీచేసింది. రంగారెడ్డి జిల్లాలోనే 200 పైగా ఉపాధ్యాయులుండగా, మిగతా జిల్లాల్లో మరో 378 మంది ఉన్నారు. ఈ నిర్ణయంపై పీఆర్టీయూ టీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ చొరవ వల్లే మేము మా రాష్ర్టానికి వెళ్లగలుగుతున్నాం. తెలంగాణలో ఉండటం వల్ల పిల్లల స్థానికత సమస్య, మా కులాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. అందుకే మేము ఏపీకి వెళ్తామని కోరాం. పీఆర్టీయూ టీఎస్ నేతలు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు కు ధన్యవాదాలు. – సూర్యనారాయణ, నాన్‌లోకల్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి