కృష్ణా జలాల్లో పోతిరెడ్డిపాడులా.. గోదావరి జలాల్లోనూ తెలంగాణకు మరో చారిత్రక అన్యాయానికి రంగం సిద్ధమైంది. కేసీఆర్ హయాంలో పదేండ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేసే వ్యూహం పకడ్బందీగా అమలవుతున్నది. తెలంగాణకు దక్కకుండా ప్రాణహిత సహా గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో స్కెచ్ వేశారని ఆదినుంచీ ‘నమస్తే తెలంగాణ’ చెప్తూ వస్తున్నది. ఇప్పుడు అదే నిజమైంది. ఢిల్లీ వేదికగా చంద్రబాబునాయుడే మీడియా ముందు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ దిశగా మేము వర్కవుట్ చేస్తున్నాము. రూ.80వేల కోట్లతో గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్నాం. పనులకు మొత్తం సాయం కేంద్రమే చేయాలని మేము కోరడం లేదు. కేంద్రం, ఏపీ కలిసి హ్యామ్ మాడల్‌లో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరాం. జీబీ లింక్ పెద్ద ప్రాజెక్టు. 200 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి బనకచర్లకు తీసుకెళ్తే ఏపీకి అదొక గేమ్‌చేంజర్.
– చంద్రబాబు, ఏపీ సీఎం
Bhanakacherla Project | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 23 (నమస్తే తెలంగాణ): రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు స్పష్టంచేశారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కే ఒక గేమ్‌చేంజర్ అని ఆయన అభివర్ణించడం గమనార్హం. వరద జలాల ఆధారంగానే పోతిరెడ్డిపాడును చేపట్టినట్టు నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పినట్టుగానే.. ఇప్పుడు చంద్రబాబు కూడా సముద్రంలోకి పోయే వృథా జలాలే బనకచర్లకు ఆధారమని చెప్తున్నారు. దీంతో గోదావరిలో తెలంగాణకు బనకచర్ల ప్రాజెక్టు మరో పోతిరెడ్డిపాడులా మారుతుందని స్పష్టమవుతున్నది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై అక్కసుతో మేడిగడ్డను రాజకీయ చట్రంలో ఇరికించిన సమయాన్ని చంద్రబాబు అదునుగా భావించి చక్రం తిప్పినట్టు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో తమిళనాడులోని కావేరీ నదికి గోదావరిని అనుసంధానించేందుకు కాచుకుకూర్చున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఇదే మంచి తరుణంగా భావించి రంగంలోకి దిగింది. కొన్ని నెలల క్రితమే ఈ మేరకు వ్యూహ రచన జరిగినట్టు, అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో మేడిగడ్డ పునరుద్ధరణను అటకెక్కించినట్టు తెలుస్తున్నది. కాగా కేంద్రం-ఏపీ ప్రభుత్వం చెరి సగం నిధులతో బనకచర్లను పూర్తిచేసేందుకు అంతర్గతంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం భరించే 50% నిధులను కూడా రుణ రూపంలో సేకరించేందుకు కేంద్రం సహకరించేలా అంగీకారం కూడా జరిగినట్టు సమాచారం. రాజు తలచుకుంటే.. అన్నట్టు కేంద్రమే బరిలో నిలవడంతో నిధుల సమీకరణ, అనుమతులు చకాచకా పూర్తి చేసుకొని తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలు సైతం ఏపీ, తమిళనాడుల్లోని భూముల్లో పారేందుకు మార్గం సుగమమైనట్టు సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. కేవలం బనకచర్ల ప్రాజెక్టు కిందనే 200 టీఎంసీలు తరలించేందుకు ప్రణాళికను రూపొందించగా… కావేరీ అనుసంధానం తోడైతే గోదావరిలో తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా మారనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
– 1978లో ట్రిబ్యునల్‌కు సమర్పించే సమయంలో 10,000 క్యూసెక్కులు
– 2005లో డీపీఆర్ సమర్పించే సమయంలో 12,250 క్యూసెక్కులు
– 2009లో డీపీఆర్‌ను టీఏసీకి సమర్పించే సమయంలో 12,250 క్యూసెక్కులు
– 2019లో 141 టీఏసీలో సమర్పించే సమయంలో 17,500 క్యూసెక్కులు
– 2025లో జీబీ లింక్ ప్రాజెక్టు ప్రపోజల్ 40,000 క్యూసెక్కులు
ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్న హైడ్రామా గుట్టు అధికారికంగా బట్టబయలైంది. మేడిగడ్డ పునరుద్ధరణను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక కారణంగా కాకుండా ఓ కుట్రలో భాగంగానే చేపట్టడంలేదని స్పష్టమవుతున్నది. గోదావరి-కావేరీ అనుసంధానంతో తమిళనాడుకు గోదావరి జలాలను తరలించాలని కొన్నేండ్లుగా ప్రయత్నించి విఫలమవుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం అస్త్రంగా మారిందనేది రుజువైంది.
చంద్రబాబు తిప్పుతున్న చక్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్‌ను కాలగర్భంలో కలిపే దిశగా అడుగులు వేస్తుండగా… ఆ మేరకు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ఇదే విషయాన్ని గత కొన్నిరోజులుగా ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. గుట్టు రట్టు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలెవరూ దీనిపై నోరు విప్పడం లేదు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు కుండబద్దలు కొట్టారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన బాబు.. బనకచర్ల గుట్టును మొత్తం విప్పారు. 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీలోని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించేందుకు చేపట్టే ఈ పెద్ద ప్రాజెక్టును కేంద్రం-ఏపీ సంయుక్తంగా చేపట్టనున్నట్టు వెల్లడించారు.
గోదావరి బనకచర్ల ప్రాజెక్టులో తొలుత గోదావరి-కృష్ణాకు 200 టీఎంసీల జలాలను తరలించి, అక్కడి నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి నాగార్జునసాగర్ రైట్ కెనాల్ మీదుగా బనకచర్లకు తరలిస్తామని వెల్లడించారు. బనకచర్ల నుంచి దిగువన సోమశిల, కండలేరు రిజర్వాయర్లతోపాటు గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, తెలుగుగంగా… ఇలా అన్ని ప్రాజెక్టులకు కూడా గోదావరి జలాలు ఇస్తామన్నారు. దానికి రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఒకవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. మేడిగడ్డను పునరుద్ధరించకుండా గోదావరి జలాల వినియోగం తగ్గించగా… చంద్రబాబు మాత్రం తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకుంటుందని చెప్పారు. ఇది ఏపీ భూభాగంలోనే (ఇంట్రా రివర్ ప్రాజెక్టు) చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాము అందరితోనూ మాట్లాడతామని, కేంద్రం కూడా మాట్లాడుతుందని చంద్రబాబు చెప్పడంతో కేంద్రం-ఏపీ సంయుక్తంగా బనకచర్లపై ఎలా ముందుకుపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
జీబీ లింక్‌ను దృష్టిలో పెట్టుకునే పోలవరం ప్రాజెక్టును ఏపీ సర్కారు అనుమతులకు మించి ముందు నుంచే భారీగా విస్తరించుకుంటూ వస్తున్నది. కాలువల సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని 1978లో ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు డీపీఆర్‌ను నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట సమర్పించింది. ఆ వివరాల ప్రకారం 150 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో పోలవరం వద్ద డ్యామ్‌ను నిర్మించాలి. ఎండీడీఎల్‌ను 145 అడుగులు కాగా, మొత్తం డ్యామ్ లైవ్ స్టోరేజీ 28.31 టీఎంసీలుగా ఉండాలి. కానీ, ఆచరణలో ఏపీ ప్రభుత్వం మాత్రం ట్రిబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు, కాలువ నిర్మాణ సామర్థ్యాలను మొదటి నుంచీ విస్తరించుకుంటూ పోతున్నది.
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలను విస్తరించింది. టీఏసీకి (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) సమర్పించే సమయంలో డ్యామ్ ఎండీడీఎల్‌ను 145 నుంచి 141 ఫీట్లకు కుదించింది. లైవ్ స్టోరేజీ కెపాసిటీని 28.31 నుంచి 75 టీఎంసీలకు పెంచింది. కాలువల సామర్థ్యాన్ని విస్తరించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పెంచిన సామర్థ్యాలకు విరుద్ధంగా కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నది. అంతేకాదు రెండు కాలువల మార్గంలో ఉన్న సొరంగ మార్గాలను ఏకంగా మొదటి 40వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఏపీ నిర్మించడం నాడు విస్మయం కలిగించింది. కానీ పక్కా వ్యూహంతోనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకునే ముందునుంచే ఏపీ పోలవరం ప్రాజెక్టును విస్తరించుకుంటూ పోతున్నదని తెలిసిపోతున్నది.
అనుకున్న విధంగానే ఏపీ ప్రభుత్వం తాజాగా గోదావరి బనకచర్ల లింక్ పేరిట ఆయా కాలువలను మరింతగా విస్తరించేందుకు పూనుకున్నది. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 1,400 క్యూసెక్కుల సామర్థ్యంతో తాడిపూడి కాలువను 80 కి.మీ పొడవుతో ఇప్పటికే నిర్మించింది. ఆ కాలువను ప్రస్తుతం ప్రకాశం బరాజ్ వరకు అంటే 105 కి.మీ పొడగించడంతోపాటు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 1,400 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు విస్తరించాలని నిర్ణయించింది. అదేవిధంగా పోలవరం కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 28 వేల క్యూసెక్కులతో ప్రస్తుతం చేపడుతున్నది. మొత్తంగా గోదావరి నుంచి రోజుకు నికరంగా 38 వేల క్యూసెక్కులు అంటే దాదాపు 3.5 టీఎంసీల జలాలను తరలించే అవకాశం ఉన్నది. ఇది ఏపీ ప్రభుత్వం కాగితాల మీద చెప్తున్న లెక్క. కానీ, ఆచరణలో రోజుకు దాదాపు 4 టీఎంసీలకు మించి జలాలను తరలించేందుకు వీలుగా పనులను నిర్వహిస్తున్నది. కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని కలిపితే మొత్తంగా రోజుకు 8 టీఎంసీలను ఏపీ తరలించే అవకాశమున్నది.
వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గోదావరిలో 1,486 టీఎంసీలను కేటాయించింది. అందులో తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి 968 టీఎంసీలు. ఏపీ వాటా 518 టీఎంసీలు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తన వాటా పరిమితికి మించి దాదాపు 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు అదనంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తంగా 200 టీఎంసీలను తరలిస్తామంటూ జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ సిద్ధమైంది. కానీ, వాస్తవంగా 350 టీఎంసీలతో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పనులను ఏపీ సర్కారు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నది.
పెన్నా బేసిన్లో ఇప్పటికే ఏపీకి ఆ మేరకు నీటినిల్వ సామర్థ్యం ఉండటం గమనార్హం. సోమశిల, కండలేరు, ఆవులపల్లి తదితర అనేక రిజర్వాయర్లను నిర్మించింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆయా రిజర్వాయర్లకు కృష్ణా జలాలను ప్రతిఏటా అక్రమంగా మళ్లిస్తూనే ఉన్నది. ఇప్పుడు గోదావరి జలాలను కూడా ఆ మేరకు పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ వేగంగా పావులు కదుపుతున్నది. ఏపీ చర్యల ఫలితంగా గోదావరి డెల్టా సిస్టమ్‌పై తీవ్ర ప్రభావానికి గురవుతుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు జీవదాయిని అయిన ప్రాణహిత జలాలను కొల్లగట్టడమే లింక్ ప్రాజెక్టు అంతిమ లక్ష్యమని, ప్రాణహితలో సంవత్సరంలో 300 రోజులపాటు నికర వరద ప్రవాహాలు అందుబాటులో ఉండటాన్ని ప్రధాన ఆధారంగా చేసుకునే ప్రాజెక్టును చేపట్టిందని, రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు.
ఏపీ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, ఆ దిశగా తాము వర్క్ఔట్ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత వివరాలను వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం రూ.80వేల కోట్లతో గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్నదని వివరించారు.
పనులకు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా చేయాలని తాము కోరడం లేదని, అయితే కేంద్రం, ఏపీ కలిసి హ్యామ్ మాడల్‌లో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరామని వివరించారు. జీబీ లింక్ పెద్ద ప్రాజెక్టు అని, 200 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి బనకచర్లకు తీసుకెళ్తే ఏపీకి అదొక గేమ్‌చేంజర్ అని వివరించారు. తొలుత గోదావరి జలాలను కృష్ణకు, అక్కడి నుంచి 150 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనున్న బొల్లంపల్లి రిజర్వాయర్‌కు, ఆపై అక్కడి నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. తద్వారా సోమశిల, కండలేరు రిజర్వాయర్లకు, తిరుపతి బాలాజీసాగర్కు, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగకు ఇలా అన్ని ప్రాజెక్టులకూ గోదావరి జలాలు ఇవ్వవచ్చని తెలిపారు.
ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని, తెలంగాణలో కూడా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయని తెలిపారు. జీబీ లింక్ అనేది ఇంట్రా రివర్ లింక్ ప్రాజెక్టుని, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏ రాష్ర్టానికీ లేదని, దానికి కూడా కేంద్రం సాయం కోరామని, అనుమతిస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ‘వందేండ్ల సగటును తీసుకున్నా 2 వేల టీఎంసీలు సముద్రంలోకి కలుస్తున్నాయి. అలా సముద్రంలోకి పోయే 200 టీఎంసీల మిగులు జలాలను కరువు ప్రాంతాలకు తరలిస్తున్నాం.
ఎవరికీ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో మాట్లాడుతాం. అందరితో కలిసి ముందుకెళ్తాం. కేంద్రం కూడా అందరితో మాట్లాడుతానని హామీ ఇచ్చింది’ అని వెల్లడించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌తో పోలవరంపై చర్చించానని, ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉన్నదని వెల్లడించారు. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. పోలవరం నాణ్యతలో రాజీపడబోమని, రూ.400 కోట్ల తో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభు త్వం దెబ్బతీసిందని, ఫలితంగా ప్రస్తుతం మళ్లీ రూ.980 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
చెన్నై తాగునీటికి ఏటా కేవలం 15 టీఎంసీలు తరలించేందుకు చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు ఇంతింతై… ఏకంగా కృష్ణా నదినే మళ్లించుకుపోయే పోతిరెడ్డిపాడులా మారింది. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడును విస్తరించే సమయంలో ఎగువ రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర ట్రిబ్యునల్ ముందు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఆ సమయంలోని వైఎస్ ప్రభుత్వం తాము కేవలం వరద జలాలపైనే ఆధారపడి ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు లిఖితపూర్వకంగా ట్రిబ్యునల్‌కు రాసి ఇచ్చింది. కానీ, కాలక్రమేణా అది తెలంగాణను ఎడారిగా మార్చింది.
నాడు వరద జలాలు అన్న పోతిరెడ్డిపాడు ఇప్పుడు హక్కులా ఏటా వందల టీఎంసీల కృష్ణా నదిని మళ్లించుకుపోయే స్థితికి చేరింది. అయితే బనకచర్ల విషయంలోనూ చంద్రబాబు శుక్రవారం అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. సముద్రంలో కలిసే రెండువేల టీఎంసీల్లో 200 టీఎంసీల గోదావరిజలాలనే తాము మళ్లిస్తున్నామని చెప్పారు. కానీ, 200 టీఎంసీలు గోదావరికి భారీ వరదలు ఉన్న సమయంలో తరలించడం అసాధ్యమనేది చంద్రబాబుకు కూడా తెలుసు. గోదావరిలో సాధారణ ఇన్‌ఫ్లోలు ఉన్న సమయంలో కూడా ఆ 200 టీఎంసీల్లో భాగమేనంటూ నీటిని తన్నుకుపోతారు. అయితే ఇక్కడ కావేరీ అనుసంధాన ప్రాజెక్టు రూపంలో మరో ముప్పు కూడా ముందుకు రాబోతున్నది.
తెలంగాణ గడ్డపై నుంచి కాకుండా ఏపీలోని పోలవరం నుంచి కావేరీకి గోదావరి జలాలను తరలించేందుకు కేంద్రం స్కెచ్ వేసింది. బనకచర్ల ప్రాజెక్టు కొలిక్కిరాగానే కేంద్రం వెంటనే కావేరీ అనుసంధాన ప్రాజెక్టును తెరపైకి తేనున్నట్టు తెలిసింది. బనకచర్లకు సహకరించిన దరిమిలా చంద్రబాబు కూడా ఏపీ భూభాగం నుంచి గోదావరిని తమిళనాడుకు తరలించే కేంద్ర ప్రాజెక్టుకు సహకరించనున్నారు. తద్వారా రెండు జాతీయ ప్రాజెక్టులను ట్రిబ్యునల్ ముందు ఉంచి ఏపీ హక్కులు పొందే కీలకమైన ప్రమాదం తెలంగాణకు చేరువలోనే ఉన్నదని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బనకచర్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లతో చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించగా… ఇందులో కేంద్రం కూడా సహకరిస్తుందని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే దీనిపై కొంతకాలం కిందటే కేంద్రంలో నిర్ణయం జరిగినట్టుగా ‘నమస్తే తెలంగాణ’ ముందే చెప్పింది. కేంద్రం-ఏపీ 50:50 నిధుల్ని భరించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా రూ.40వేల కోట్లను కేంద్రం సమకూర్చగా.. మిగిలిన రూ.40వేల కోట్లు ఏపీ భరించాల్సి ఉంటుంది. అయితే ఆ నిధులను కూడా రుణాల రూపంలో సమకూర్చేందుకు కేంద్రం సహకరించేందుకు సూత్రప్రాయంగా అంతర్గతంగా అంగీకారం జరిగినట్టు తెలిసింది. అందుకే చంద్రబాబు శుక్రవారం మీడియా సమావేశంలో హ్యామ్ మాడల్ పద్ధతిలో చేపట్టాలని కేంద్రాన్ని కోరామన్నారు.
అంటే ఏపీ భరించాల్సిన నిధుల సమీకరణకు కూడా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించనున్నది. దీంతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి సహకరించిన కేంద్రం.. ఇప్పుడు ఏకంగా రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టుకు సైతం పూర్తిస్థాయి చేయూతను ఇవ్వనున్నది. కానీ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు నయాపైసా విదిల్చలేదు. పైగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వాలని ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు.