Atchannaidu | ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వేధింపులు తట్టుకోలేక ఆగ్రోస్ ఎండీ జీఎం రాజమోహన్ సెలవులపై వెళ్లిపోయారు. ఈ మేరకు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSAIDC) వీడీ, ఎండీకి ఆయన లేఖ రాశారు. ఇదే లేఖను ఏపీ సీఎస్ విజయానంద్‌కు కూడా పంపించారు. ఒత్తిళ్లు, పరోక్ష వేధింపులు తాళలేక, గౌరవం కాపాడుకునేందుకు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
తాను 1992 నుంచి ఏపీఎస్ఐడీసీలో సేవలందిస్తున్నానని.. ప్రస్తుతం జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని రాజమోహన్ తెలిపారు. ఇటీవల ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అవకతవకలకు పాల్పడటం గుర్తించానని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగిని బదిలీ చేసి, షోకాజ్ నోటీసులు ఇచ్చానని చెప్పారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఓఎస్డీ పిలిపించి, ఆ ఉద్యోగి తరలింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. పేషీతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. ఇది తన అధికారిక బాధ్యతలు, నైతిక విలువలకు విరుద్ధమని భావించి దానికి ఒప్పుకోలేదని తెలిపారు.
తమ అవినీతికి సహకరించనని చెప్పినందుకు తనను మంత్రి అచ్చెన్నాయుడు నెల్లూరుకు బదిలీ చేయించారని తెలిపారు. ఇక తన స్థానంలో ఒక జూనియర్ అధికారిని నియమించేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ అతను ఆ పోస్టుకు అర్హుడి కాదని.. అతనిపై పెండింగ్ కేసులు కూడా చాలానే ఉన్నాయని వివరించారు. ఈ అన్యాయాన్ని గుర్తించిన వీసీ, ఎండీ బదిలీకి నిరాకరించి తన ట్రాన్స్ఫర్ను ఆమోదించలేదని తెలిపారు. అయినప్పటికీ తనపై పరోక్ష వేధింపులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా దీర్ఘకాల సెలవులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా ఎల్లప్పుడూ కార్పొరేషన్ ప్రయోజనాలకే కట్టుబడి పనిచేశానని.. తన సర్వీసులో ఆఫీసు సమగ్రతకు భంగం కలిగించే ఏ నిర్ణయానికి తలొగ్గలేదని స్పష్టం చేశారు.
Agros