Anushka Shetty | టాలీవుడ్లో ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘భాగమతి’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి ఇటీవల ‘ఘాటి’ చిత్రంతో పలకరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటివారం విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఘోరంగా నిరాశపరిచింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గంజాయి మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి రోజు ఓ మోస్తరుగా ఆడినా, ఆ తర్వాత నుంచే నెగటివ్ టాక్ వలన అడ్రెస్ లేకుండా పోయింది. వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి ఆ సినిమాని తీసేసారు. విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనుష్క ‘శీలావతి’ పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, కథలోని లోపాలు, స్లో నరేషన్ సినిమాకి మైనస్ అయ్యాయి.
ఘాటి చిత్రం అనుష్క చాలా కాలం తర్వాత నటించిన పూర్తి స్థాయి ప్రధాన పాత్ర సినిమా కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా దారుణంగా ఫెయిలవ్వడంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా, చిత్ర ప్రమోషన్లకు అనుష్క దూరంగా ఉండటంపై అప్పుడే సందేహాలు మొదలయ్యాయి. సినిమా విడుదలైన వారం రోజులకి అనుష్క తన ఫేస్బుక్లో ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. నీలి వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ… సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండబోతున్నాను. త్వరలోనే మరిన్ని కథలతో, మరింత ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి .. ప్రేమతో మీ స్వీటీ అని అనుష్క రాసుకొచ్చింది.
అనుష్క మాటలు అభిమానులను కలచివేశాయి. సినిమా ఫెయిల్యూర్ వలన భావోద్వేగానికి గురై అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ఈ విరామం ఆమెకు సెల్ఫ్-హీలింగ్ సమయంగా ఉంటుందని ఆశిస్తున్నారు. అనుష్క పోస్టులో “త్వరలోనే మరిన్ని కథలతో మీ ముందుకొస్తాను” అన్న వ్యాఖ్యలు ఆమె మరోసారి శక్తివంతమైన పాత్రలతో రానుందనే సంకేతాలు ఇస్తున్నాయి. గతంలో లావుగా మారి తన ఫిజిక్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న అనుష్క, ఇప్పుడు తన ఫిట్నెస్, కెరీర్‌పై మరింత దృష్టి పెట్టబోతున్నట్లు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.