Anushka Shetty | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న పేరు. నాగార్జునతో కలిసి చేసిన ‘సూపర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అనుష్క, మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ, గ్లామర్ మరియు నటన రెండింటిలోనూ దిట్టగా నిలిచింది. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘బాహుబలి’ వంటి చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ మరో స్థాయిలో మార్క్ సెట్ చేసిన ఈ బ్యూటీ, కుటుంబ కథా చిత్రాల్లోనూ అద్భుతమైన నటనతో మెప్పించింది.
అయితే ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో కొంతకాలం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టితో చేసిమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంది. ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఘాటీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం అనుష్క ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల అనుష్కకి సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తన అసలు పేరు , దాన్ని మార్చుకోవడం వెనక ఉన్న కథను వెల్లడించారు.
అనుష్క మాట్లాడుతూ .. “నా అసలు పేరు స్వీటీ శెట్టి. మొదటి సినిమాలో కూడా అదే పేరు ఉంచాలని అనుకున్నాం. కానీ ‘సూపర్’ సినిమా కోసం పేరు మార్చుకోవాలని నిర్ణయించారు. అప్పుడు మా నాన్నగారు, నాగార్జున గారు కలిసి ‘స్మృతి శెట్టి’ అనే పేరు పెట్టమని సూచించారు. కానీ ఆ పేరు నాకు నచ్చలేదు. పలుకుతుంటే ముక్కు దగ్గరగా ఆగిపోతుంది (నవ్వుతూ), అందుకే ఆ పేరును వదిలేశాను. చివరికి నా మనసుకి నచ్చిన పేరు ‘అనుష్క శెట్టి’ ని ఫిక్స్ చేసుకున్నా,” అని స్వీట్‌గా గుర్తుచేసుకున్నారు. అనుష్క ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు “స్వీటీ పేరుకన్నా అనుష్కనే సూపర్‌గా సరిపోయింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ సీక్వెల్లో (‘కల్కి 2’) కీలక పాత్రలో నటించే అవకాశముందని టాలీవుడ్ వర్గాల సమాచారం.