రాజ్‌కోట్, డిసెంబర్ 10: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్ జిల్లాలోని ఆట్కోట్లో ఓ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి విఫలమైన ఓ కామాంధుడు ఆ బాలిక మర్మావయంలోకి ఇనుప కడ్డీని చొప్పించి తీవ్రంగా గాయపరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం వేటాడి ఎట్టకేలకు 35 ఏళ్ల వ్యవసాయ కూలీని అరెస్టు చేశారు. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాజ్‌కోట్ గ్రామీణ ఎస్పీ విజయ్‌సింహ్ గుర్జర్ విలేకరులకు వెల్లడించారు. దహోద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆట్కోట్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తోంది.
సమీపంలోని పొలంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా వారి ఆరేండ్ల కుమార్తె పొలం వద్ద ఆడుకుంటోంది. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి చేరుకుని బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ బాలిక గట్టిగా ఏడవడంతో నిందితుడు ఆమె మర్మావయవంలోకి ఇనుప రాడ్డును చొప్పించి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక రోదన విని పరుగెత్తుకు వచ్చిన తల్లిదండ్రులకు తీవ్ర రక్తగాయాలతో ఉన్న కుమార్తె కనిపించింది. వెంటనే ఆ బాలికను రాజ్‌కోట్‌లోని జన్నా దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని దవాఖాన వర్గాలు తెలిపాయి. దాదాపు 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిలో 10 మందిని శిశు నిపుణుల సమక్షంలో బాలిక ఎదుట హాజరుపరచగా తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని ఆమె గుర్తించింది. నిందితుడు మధ్యప్రదేశ్‌లోని అజిరాజ్పూర్ జిల్లాకు చెందిన రాంసింగ్ తేరాసింగ్ దద్వేజర్ను నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలోని ఓ పొలంలో అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు.