న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: మెదడు సంబంధిత వ్యాధులను కలుగజేసే మరో కొత్త వైరస్ చైనాలో వెలుగుచూసింది. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్ వైరస్ (వెల్వ్)గా పేర్కొంటున్నారు. వెస్ట్ల్యాండ్లోని ఓ పార్కును సందర్శించిన వ్యక్తికి ఈ వైరస్ మొదటిసారి సోకినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మంగోలియాలోని వెస్ట్‌ల్యాండ్ పార్కులో కీటకం బారిన పడిన వ్యక్తి తీవ్రమైన జ్వరం, శరీర అవయవాలు పనిచేయకపోవడం వంటి లక్షణాలతో దవాఖానలో చేరాడని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పత్రిక ఈ నెల 4న ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ తరువాత ఆ పార్కును సందర్శించిన వారు లేదా అవే వ్యాధి లక్షణాలున్న వారిని పరీక్షించగా మరో 17 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఆ పత్రిక తెలిపింది. వైరస్ సోకినవారందరికీ ఒకే విధమైన లక్షణాలు లేవని వైద్యనిపుణులు పేర్కొన్నారు. చాలామందిలో జ్వరం, అలసట, కండ్లు తిరగటం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. కొందరి శరీరంపై చిన్నగా, గుండ్రంగా ఎరుపు లేదా ఊదారంగులో మచ్చలు వచ్చాయని పేర్కొన్నారు. ఒక రోగిలో అత్యంత అరుదైన మెదడు సంబంధిత నరాల బలహీనత కనిపించిందని తెలిపారు. తమ అధ్యయనంలో వెల్వ్-ఆర్ఎన్ఏ వైరస్‌ను గొర్రెలు, గుర్రాలు, పందుల్లో కూడా కనుగొన్నామని పేర్కొన్నారు.