గజ్వేల్, మే 15 : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. గజ్వేల్‌లోని మధురానగర్‌కు చెందిన పసుల స్వామి (33) గతంలో కారు డ్రైవర్‌గా జీవనం సాగించాడు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో కొద్దిరోజులపాటు ఇంటి వద్దే ఉన్నాడు. కుటుంబం గడిచే పరిస్థితి లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం ఆటోను కొనుక్కుని సొంతంగా నడుపుతున్నాడు.అప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా జీవనం సాగిన ఆ కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో కష్టాలు మొదలయ్యాయి. గిరాకీ లేక ఆటో నడవకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. తీవ్రంగా కలత చెందిన స్వామి మంగళవారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి శవ పంచనామా పూర్తిచేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ దవాఖానకు తరలించారు. స్వామికి భార్యతోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్ తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.