కడ్తాల్, డిసెంబర్ 14 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్‌లో రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.30 లక్షలతో వైకుంఠధామం, రూ.6 లక్షలతో పల్లెప్రకృతి వనం, వాకింగ్ ట్రాక్, రూ.2.5 లక్షలతో చేపట్టిన డంపింగ్ యార్డు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవాలతోపాటు, రూ.68 లక్షలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనను ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మనిషి చివరి మజిలీ కోసం ప్రభుత్వం గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించిందని పేర్కొన్నారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నదని తెలిపారు.
జిల్లాలో మరో 40 రైతు వేదికల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యమే పండేదని, వర్షాలు సమృద్ధిగా కురువడంతో ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం పండిందని పేర్కొన్నారు. రైతుబంధు పథకంతో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. కేంద్రం వరి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నదని, రైతులు వరికి బదులు ఇతర పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఫార్మా, ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
బీజేపీ నాయకులు ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడి నాయకులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెప్పించడంతోపాటు, ఏటా 2 వేల కోట్ల ఉద్యోగాలను ఇప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. కడ్తాల్ అభివృద్ధికి సహకరిస్తామని, మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం, గ్రంథాలయం, ప్రభుత్వ దవాఖాన, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు సహకరించిన ఎన్ఆర్ఐ (ఆటా అమెరికా) బృందం సభ్యులను మంత్రి అభినందించారు.
డబుల్ రోడ్డు మంజూరు
ఎంపీ రాములు మాట్లాడుతూ.. హైదరాబాద్-శ్రీశైలం రహదారిని నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని కేంద్రానికి లేఖ రాశామని పేర్కొన్నారు. రూ.1200 కోట్లతో హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు డబుల్ రోడ్డు మంజూరైందని, దీంతో హైదరాబాద్-తిరుపతికి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుందన్నారు.
మండలాభివృద్ధికి సహకరించాలి
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ కడ్తాల్ మండల అభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా సిటీ సమీపంలో ఉన్న కడ్తాల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో రూ.48 లక్షలతో చేపట్టనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కోరుతూ ట్రిబ్యునల్‌కు వెళ్లింది విపక్ష నాయకులు కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జిల్లాలో కలిసిన కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మహిళా సమాఖ్య భవనానికి రూ.10లక్షలు మంజూరు
జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు సమగ్ర సమాచారాన్ని అందజేస్తారన్నారు. మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనానికి జడ్పీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆమె అన్నారు.
మండల కేంద్రంలో ఏర్పాటుకానున్న ప్రభుత్వ దవాఖానకు సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి తన తండ్రి మనోహర్‌రెడ్డి జ్ఞాపకార్థం రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, అనురాధ, జంగారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, హరిచంద్‌నాయక్, సులోచన, భారతమ్మ, శంకర్, విజయలక్ష్మి, లోకేశ్‌నాయక్, సేవ్యాబావోజీ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాములుగౌడ్, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, వినోద్, గణేశ్, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు వీరయ్య, నర్సింహ, బాలకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, నర్సింహగౌడ్, సేవ్యానాయక్, శ్రీనివాస్‌గుప్తా, నాయకులు చందోజీ, శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్‌గౌడ్, మహేశ్, వెంకటేశ్, రాఘవేందర్, రమేశ్, సాయిలు, లింగం, మహేశ్, చంద్రమౌళి, శంకర్, బాబా, రాజేందర్‌యాదవ్, ఇర్షాద్, సాయికుమార్, అంజయ్య, కార్తీక్, ఆర్డీవో వెంకటాచారి, ఏసీపీ భాస్కర్, సీఐ ఉపేందర్, ఎస్సైలు హరిశంకర్‌గౌడ్, వరప్రసాద్, ధర్మేశ్, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఏంపీవో తేజ్‌సింగ్, డీఈఈలు తిరుపతిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఏడీవో సుజాత, ఏవో శ్రీలత, ఏఈలు శ్రీధర్, సృజన, వాగ్దేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.