హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి కేసీఆర్ తిప్పికొట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఏడేండ్లలో లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 60 నుంచి 70వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. రెండు, మూడురోజుల్లో భర్తీపై సమావేశం నిర్వహిస్తామని, ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీచేస్తామని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యువతకు మేలుచేకూర్చే నిర్ణయాలు ఎన్నో తీసుకొన్నామని, కొత్త జోనల్ వ్యవస్థే అందుకు నిదర్శమని తెలిపారు. దీనివల్ల గెజిటెడ్ పోస్టులతోసహా, ఏ జిల్లాకు చెందిన ఉద్యోగాలు, ఆ జిల్లా యువతకే వస్తాయని, 95% పోస్టులు స్థానిక యువతకే దక్కనున్నాయని వెల్లడించారు. ఈ జోనల్ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆరేండ్లు పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు.
2కోట్ల ఉద్యోగాలని, ఏటా కోటి పీకేస్తున్నారు
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, ఏటా కోటి మంది ఉద్యోగాలను ఊడగొడుతున్నదని కేసీఆర్ విమర్శించారు. దేశంలోనే నిరుద్యోగం తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, అయినా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
బాజాప్తాగా విరాళాల లెక్క
టీఆర్ఎస్కు వచ్చిన విరాళాలపై దాపరికమేమీ లేదని కేసీఆర్ అన్నారు. పార్టీకి రూ.250 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వాటినుంచి వచ్చే నెలవారీ మిత్తీలతో పార్టీని నడుపుతున్నామని ఇటీవల ప్లీనరీలోనే చెప్పానన్నారు. ఇటీవల మరో రూ.200 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్పారు. ‘మా పార్టీకి విరాళాలు రావటం బీజేపీ నేతలకు మింగుడు పడటంలేదు. మాకు ఇంకో రూ.400 కోట్లు వస్తయి. నీకెందుకు కన్నుకుట్టు? ఎందుకు ఎగిసిపడుతున్నవ్’ అని నిలదీశారు. బీజేపీ మాదిరిగా తాము వాళ్లను, వీళ్లను బెదిరించి పైసలు గుంజుకొని బతుకబోమని స్పష్టంచేశారు.
కాళేశ్వరాన్ని చూసి ప్రపంచం అబ్బుర పడుతున్నది
కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు పట్టేదని, ఐదారువందల కేసులను అధిగమించి మూడున్నరేండ్లల్లో ప్రాజెక్టును కట్టామని కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టును చూసి ప్రపంచం అబ్బురపడుతున్నదని, న్యూయార్క్ టైమ్స్ స్కేర్‌లో ప్రదర్శించిన మొదటి భారతీయ ప్రాజెక్టు కాళేశ్వరమని గుర్తుచేశారు. డిస్కవరీ చానల్ సైతం డాక్యుమెంటరీ రూపంలో ప్రపంచానికి కాళేశ్వరం గురించి వివరించిందన్నారు.
కొత్తదనాన్ని అంగీకరించని కేంద్రం
ప్రపంచంలో మార్పులు వేగంగా వస్తుంటాయని, ఈ మధ్యకాలంలో చాలా వేగంగా దూసుకొస్తున్న రంగం ఎలక్ట్రికల్ మోటర్స్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎంజీ ఎలక్ట్రికల్ కారు ఉన్నదని, ఈ మధ్య తాను కూడా కొన్నానని చెప్పారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు వేలకొద్దీ అమ్ముడుపోతున్నాయన్నారు. ‘నాకున్న పరిజ్ఞానం మేరకు కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్ బంకులు పోయి ఎలక్ట్రిక్ చార్జింగ్ బంకులు వస్తా యి. హైదరాబాద్‌లో ఈవీలు ఎక్కువ అమ్ముడవుతున్నాయి. నేను కారు కొన్నప్పుడు వాళ్లు నాతో ఫొటో దిగారు. అప్పటికే ఆ మోడల్ దాదా పు 200 కార్లు అమ్మినట్టు చెప్పారు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నకొద్దీ కొత్తకొత్త పరిణామాలు వస్తాయి. తెలివిగల దేశ ప్రభుత్వాలు వెంటనే వాటిని అందుపుచ్చుకొని, ప్రజల ముందుకు తీసుకెళ్తాయి. కానీ మనదేశంలో అట్లా జరుగుతలేదు. అదే ఇప్పుడు పంచాయితీ’ అన్నారు.
మిస్టర్ బండీ.. ఉద్యమంలో నీ అడ్రస్ ఎక్కడ?
తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ని సీఎం కేసీఆర్ నిలదీశారు. ‘పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటెయ్యలేదు అంటవా? ఇంతకన్నా మూర్ఖత్వం ఏదన్నా ఉంటదా? ఎక్కడి తెలంగాణ.. ఏం కథ! ఎక్కడ మోపైనవు? తెలంగాణ ఉద్యమంలో నీ అడ్రస్ ఎక్కడ? నువ్వెవనివి? నువ్వు దేశానికి తెల్వదు.. రాష్ర్టానికి తెల్వదు. ఇయ్యాల వచ్చి చెంగడబింగడ దుంకుతా అంటే కుదురదు. వీళ్ల కథ తేల్చేదాకా వరుసగా నేనే దిగుత.. వదిలిపెట్టను. తెలంగాణలో హనుమంతుని గుడిలేని ఊరు ఉండదు.. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ప్రతీ ఇల్లు చేరుతున్నది’ అని సీఎం పేర్కొన్నారు. సిగ్గుమాలిన మాటలు బంద్ చేయాలని సంజయ్‌ని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో చెప్పినట్టు దళితుడినే ముఖ్యమంత్రిని చేద్దామనుకున్నా అనేక కారణాల వల్ల కుదరలేదని సీఎం తెలిపారు. తామే దళితుడిని సీఎంను చేయనీయలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ గతంలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దళితుడిని సీఎంను చేయకపోయినా 2018 రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అర్థం చేసుకొన్నారని, మొదటిసారి 63 స్థానాలు వస్తే రెండోసారి 88 చోట్ల గెలిచామని తెలిపారు.
యోగ్యతతోనే పదవులు
యోగ్యత ఉంటేనే మంత్రి పదవులిస్తామని, క్యాబినెట్లో ఉద్యమకారులే కాదు, అందరూ సమపాళ్లలో ఉంటారని కేసీఆర్ అన్నారు. సమయం సందర్భాలను బట్టి ఉద్యమకారులకు కూడా అవకాశాలు వస్తుంటాయని తెలిపారు. ఇతర పార్టీల నుంచి సీనియర్లు వస్తే తీసుకొని వారి సేవలను తెలంగాణ కోసం వినియోగించుకుంటామని పునరుద్ఘాటించారు. ‘నిన్నకాక మొన్న మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియాను తీసుకొని కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదా? ఆయనేమైనా ఆర్ఎస్ఎస్ వ్యక్తా? బీజేపీకి చెందిన వారా? మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా?’ అని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రతిన..
ప్రాణం పోయే దాకా తెలంగాణ కోసం,తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడుతూనే ఉంట! మాకెవ్వడూ బాస్ లేడు. మేం ఎవరి ఆదేశాలూ తీసుకోం. తెలంగాణ ప్రజలే మా బాస్. వారి ఆదేశాలు మాత్రమే స్వీకరిస్తం.