తాళ్లపాక అన్నమాచార్యులు అంటే వేలాది కీర్తనలతో వేంకటేశ్వర స్వామిని వినుతించిన సంగతే చాలామందికి తెలుసు. కానీ ఆయన కీర్తనలే కాకుండా శతకాలు, ద్విపదలు ఇలా చాలా రచనలే చేశారు. వాటిలో ఒకటి ‘వేంకటేశ్వర శతకం’. అన్నమయ్య తొలిసారిగా తిరుమలను తన పదహారో ఏట దర్శించుకున్నట్టుగా చెబుతారు. తిరుమలకు మెట్లదారిలో సాగుతుండగా మోకాళ్ల ముడుపు దగ్గర ఆయన అలసటతో మైమరిచి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అన్నమయ్య పాదరక్షలు ధరించి ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు కలలో అలమేలు మంగమ్మ దర్శనమిచ్చింది. అలసి సొమ్మసిల్లిన అన్నమయ్యను అమ్మవారు కలలోనే ఊరడించింది.
పాదరక్షలు విడిచి కొండను ఎక్కమని సూచించింది. స్వామివారి దివ్యప్రసాదాన్ని తినడానికి ఇచ్చి ఆచార్యుల ఆకలి తీర్చి అంతర్ధానమైంది. ఇంతలో మెలకువ వచ్చిన అన్నమయ్య కలలో జరిగిందానికి కలవరపడ్డాడు. తాను చూసింది నిజమో కాదో అని సంశయించాడు. చివరికి ‘వేంకటేశ్వరా!’ ముద్రతో ఆశువుగా ఏకంగా ఓ శతకాన్నే చెప్పాడు. ఈ శతకంలో ప్రతి పద్యం చివర వేంకటేశ్వర మకుటమే ఉన్నప్పటికీ దీన్ని అలమేలు మంగకు అంకితమివ్వడం విశేషం. దీనికి నిదర్శనం శతకం చివరి పద్యమైన ‘అమ్మకు తాళ్ళపాక ఘనుడన్నడు పద్యశతంబు జెప్పెగో/ కొమ్మని…’ అంటూ సంబోధించడంలో వెల్లడవుతుంది.