కరీంనగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం కొత్తగా ఇంటర్వ్యూను తెరపైకి తేవడమే ఇందుకు కారణం. ఇన్నాళ్లూ ప్రతిభ ఆధారంగా భర్తీ చేసిన ఈ పోస్టులను ఇప్పుడు ఇంటర్వ్యూ పేరిట 10 మార్కులను కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మార్కుతోనే జాతకాలు తారుమారయ్యే పరిస్థితులున్న ఈ రోజుల్లో ఏకంగా ఎంపిక కమిటీ చేతిలో పది మార్కులు పెడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులకు లబ్ధి కల్పించేందుకు ఇంటర్వ్యూను తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇంటర్వ్యూ మార్కుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టారు. ఆయా పోస్టులను బట్టి.. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టారు. తాము చెప్పిన వారికే.. పోస్టులు వస్తాయంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. అందిన కాడికి దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో సర్కార్ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుండగా, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. వీటి భర్తీకి సంబంధించి గతంలో ఉన్న ఉత్తర్వులను మారుస్తూ కాంగ్రెస్ సర్కార్.. ఈ ఏడాది మే 15న ఒక సర్క్యులర్ (సర్క్యులర్ మెమో నంబర్ 2359/ఐసీడీఎస్-2/2024 తేది 13-5-2026) జారీ చేసింది. ఎంపికకు వంద మార్కులను నిర్ధారించింది. అందులో కనీస విద్యార్హత ఇంటర్‌గా పేర్కొన్నది. ఆ మేరకు ఇంటర్ విద్యార్హతకు 70 మార్కులు, వితంతువులకు 5, అనాథలకు 10, దివ్యాంగులకు 5 మార్కులు కేటాయించిన సర్కార్.. ఇంటర్వ్యూ పేరిట 10 మార్కులు కేటాయించింది. 2022కు ముందు అంగన్వాడీ పోస్టులకు అర్హత పదో తరగతి ఉండేది. ఆ తర్వాత ఈ పోస్టుల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్ 12న అప్పటి మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 37ను జారీచేసింది. గతంలో ఉన్న పదో తరగతి అర్హతను ఇంటర్‌కు పెంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక విధానాలకు సంబంధించి.. స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. ఆ ప్రకారంగా చూస్తే.. రోస్టర్ పద్ధతిని పాటించడంతోపాటు మొత్తం వంద మార్కులకు గాను.. ఇంటర్ విద్యార్హతకు ఆనాడు 80 మార్కులను కేటాయించింది. వితంతువులకు 5 మార్కులు, జేజే యాక్ట్-2015 ప్రకారం అనాథలకు 10, ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్- 2016 ప్రకారం విభిన్నరంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి 5 మార్కుల చొప్పున కేటాయించింది. పై మార్కుల మెరిట్ అధారంగా అంగన్వాడీ కేంద్రాల్లోని అన్ని పోస్టులను బీఆర్ఎస్ సర్కార్ భర్తీ చేసింది. దీనివల్ల.. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు, పైరవీలకు అవకాశం లేకుండా గత బీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకున్నది.
ఆంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీలో విద్యార్హతలు, మెరిట్‌కు ప్రాధాన్యత ఉంటుందని ఆశించిన మహిళలకు.. తాజాగా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఇంటర్వ్యూ విధానం ఆందోళనకు గురిచేస్తున్నది. గతంలో ఇంటర్ కోసం కేటాయించిన 80 మార్కుల్లో 10 మార్కులను తగ్గించి.. వాటిని ప్రస్తుతం ఇంటర్వ్యూకు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఇచ్చే మార్కుల విషయంలో స్పష్టమైన ప్రమాణాలు పాటించే మార్గదర్శకాలు లేవు. దీంతో ఎంపిక ప్రక్రియలో వ్యక్తిగత ప్రాధాన్యతలు, సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లకు అవకాశాలుంటాయన్నది నిర్వివాదాంశం. అంగన్వాడీ పోస్టుల భర్తీ కమిటీకి ప్రతి జిల్లాలో చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. మహిళా శిశుసంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆర్డీవో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందా?
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గదా? అంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. అసాధ్యమన్న సమాధానాలే వస్తున్నాయి. ఇంటర్వ్యూ పేరుతో 10 మార్కులు కేటాయించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నదన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. నిజానికి ఒక్క మార్కుతోనే జాతకాలు తారుమారు అవుతాయి. అలాంటిది ఎంపిక కమిటీ చేతిలో పది మార్కులు పెట్టారంటే.. కచ్చితంగా అధికార పార్టీ నాయకులకు లబ్ధి కల్పించేందుకే.. ఈ కొత్త విధానం సర్కార్ తెరపైకి తెచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇంటర్వ్యూలో ఎవరికి ఎన్ని మార్కులు ఎందుకు వచ్చాయి?’ అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకొని.. మొత్తం ఎంపికను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే కాంగ్రెస్ సర్కార్ వ్యూహం అనే విమర్శలొస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ గ్రూపు పోస్టులకే.. ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా.. పరీక్షల్లో సాధించే మెరిట్ ఆధారంగా పోస్టులు ఇవ్వాలని డిమాండ్లు వస్తుంటే.. ఏకంగా అంగన్వాడీ పోస్టులకే కాంగ్రెస్ సర్కార్ ఇంటర్వ్యూలను పెట్టడం చర్చనీయాంశంగా మారుతున్నది. ‘
పోస్టుల భర్తీకి జిల్లాల్లో నోటిషికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లా ల్లో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయిం ది. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లవారీగా కేటాయించిన వివరాలు ఇప్పటికే కాంగ్రెస్ నేతల చేతుల్లోకి చేరాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు చాలా ప్రాంతాల్లో రంగంలోకి దిగారు. ‘మేము చెప్పిన వారికే పోస్టు వ స్తుంది’ అంటూ ప్రచారం చేసుకుంటున్నా రు. ఇంటర్వ్యూకు 10 మార్కులున్న విషయాన్ని అస్త్రంగా చేసుకొని.. ఈ ప్రక్రియకు ఒడిగడుతున్నట్టు తెలుస్తున్నది. టీచర్ పో స్టుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వ రకు.. హెల్పర్ పోస్టుకు రూ.లక్ష వరకు వసూలు చేసేందుకు బేరాలు మొదలు పె ట్టారని తెలుస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా లో 55 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌కు వెలువడింది.
ఒక మండలంలో కాంగ్రెస్ నాయకులు ఒక టీచర్ పోస్టుకు రూ.రెండు లక్షలు ఇస్తే పని అవుతుందని చెప్తున్నట్ట్టు తెలిసింది. ఇదే దందా రాష్ట్రంలోని నోటిషికేషన్లు జారీ అయిన అన్నీ జిల్లాల్లోనూ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం జిల్లాలవారీగా జారీ అవుతున్న నోటిఫికేషన్లు చూస్తే.. 2026 జూలై 1 నాటికి 18 ఏండ్లు నుంచి 35 ఏండ్లల్లోపు ఉన్న వారే అర్హులు అని స్పష్టం గా పేర్కొంటున్నారు. 2026లో తెలంగాణ ప్రభుత్వం సాధారణ ప్రభుత్వ ప్రత్యక్ష నియామకాల గరిష్ఠ వయస్సును 34 నుంచి 44 ఏండ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ సాధారణ వయోపరిమితి పెంపు అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఆటోమేటిక్‌గా వర్తిస్తుందా? లేదా? అనేది అంగన్వాడీ నియామక నిబంధనల్లో గానీ, నోటిఫికేషన్లలో గానీ స్పష్టంగా పేర్కొన్న దాఖలాలు లేవు.